- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంపు కొడుతున్న ఇస్నాపూర్..!
వర్షాకాలం ఆదిలోనే ఇస్నాపూర్ నుంచి మైలారం వెళ్లే ప్రధాన రహదారి పూర్తి అధ్వానంగా మారింది.

దిశ, పటాన్ చెరు టౌన్: వర్షాకాలం ఆదిలోనే ఇస్నాపూర్ నుంచి మైలారం వెళ్లే ప్రధాన రహదారి పూర్తి అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ భారీ గుంతలుగా మారాయి. ఎక్కడపడితే అక్కడ బురద, వర్షపు నీటితో రోడ్లన్నీ మురికి కాలువలుగా మారి కంపు కొడుతున్నాయి. ప్రధాన రహదారి అయిన ఇస్నాపూర్, పాశమైలారంలో పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ లోపించిందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య స్థానికులు పలు మార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రోడ్డుపై పేరుకుపోయిన బురదను తొలగించాలని కోరుతున్నారు. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ఇస్నాపూర్-మైలారం రోడ్డు కాస్త వర్షానికి బురదమయంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇస్నాపూర్ విలేజ్ గేట్ నుంచి ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ వరకు చిన్నపాటి వర్షానికే రోడ్డుపై నీరు నిలిచి బురద పేరుకుపోయి కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా మారాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ముఖ్యంగా పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ రోడ్డు ఉందో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఇండస్ట్రియల్ ఏరియా కావడం తో అనునిత్యం భారీ వాహనాలు తిరుగుతునందున బురదతో నిండిన రోడ్లలో ద్విచక్ర వాహనాలు జారిపడే ప్రమాదం ఉండటంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఈ సమస్య స్థానికులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్య ను తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రోడ్డు పై పేరుకుపోయిన బురదను తొలగించినట్లయితే నీరు నిల్చునే ఆస్కారం ఉండబోదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
వర్షపు నీరు నిల్వతో దుకాణదారులకు ఇక్కట్లు..
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ఇస్నాపూర్ మైలారం రోడ్డు కాస్త వర్షానికి బురదమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలువురు దుకాణ యజమానులు. ముందే ఇరుకైన రోడ్లు, అందులో కొద్దిపాటి వర్షానికి దుకాణాల ముందు వర్షం నీరు నిల్వ ఉండటం మూలంగా మా వద్దకు వచ్చే వినియోగదారులకు పార్కింగ్ కు స్థలం లేక, కలిగే అసౌకర్యం వల్ల వెను తిరిగి వెళ్లిపోతున్నారని వారు వాపోతున్నారు. దీంతో వ్యాపారంలో నష్టాలు చెవి చూడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందుతున్నారు. దుకాణాల ముందు వర్షపు నీటి నిల్వ కారణంగా తీవ్ర దుర్గంధంతో
చిరు వ్యాపారస్తులకు తప్పని గోస..
కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా సండే వస్తే చాలు ఇస్నాపూర్ అంటేనే చిన్నపాటి కోటి తలపిస్తుంది. ఇక్కడ పరిశ్రమలు ఎక్కువ ఉండడం మూలంగా పారిశ్రామిక ప్రాంతంగా పేరు ఉన్న ఇస్నాపూర్ మున్సిపాలిటీలో దేశ నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వలస వచ్చి స్థిరపడిన వారే ఎక్కువ. దీని మూలంగా ప్రతి సండే హైదరాబాద్ నలుమూలల నుంచి చిరు వ్యాపారస్తులు ఇక్కడి మార్కెట్లో స్టాళ్లను ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు పెడుతున్నారు. సామాన్య ప్రజలకు కావలసిన కూరగాయలు, నిత్యావసర సరుకులు, వారి జీవన విధానానికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువుని ఇక్కడికి వచ్చి చవకైన ధరలకు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం వర్షాల కారణంగా ఈ రోడ్డులో ఎక్కడపడితే అక్కడ బురద, మురికి నీరు నిల్వ, డ్రైనేజీ కంపుతో నిండిపోయింది. అయినా అవన్నీ లెక్కచేయకుండా, పొట్ట తిప్పల కోసం మురికి కాలువ పక్కనే స్టాళ్లను ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముందస్తు చర్యలు కేవలం మాటలేనా ?
అభివృద్ధి మాట అటు ఉంచితే, వర్షాకాలానికి ముందే రహదారుల మరమ్మతులు, మురికి కాల్వల శుభ్రత, నీటి పారుదల ఏర్పాట్లు చేపట్టామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీకి కూతవేటు దూరంలో నే ఇంత అధ్వాన పరిస్థితి నెలకొన్నా, మున్సిపల్ అధికారులు, సిబ్బంది కళ్ళుండి కూడా గుడ్డివాడిలా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ నుండి పాశమైలారం వెళ్లే వరకు ఎక్కడ చూసినా డ్రైనేజీ, మురికి నీటితో కంపు కొడుతున్న రోడ్ల దుస్థితి అధికారులకు పట్టదా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్ స్పందించి వెంటనే క్షేత్రస్థాయిలో రహదారిని పరిశీలించాలనే వాదనలు ప్రజల్లో జోరుగా వినిపిస్తుంది. స్థానిక ప్రజలు, వాహనదారుల భద్రత దృష్ట్యా మున్సిపల్ యంత్రాంగానికి తక్షణమే ఆదేశాలు జారీ చేసి అత్యవసర నిధులతో గుంతలను పూడ్చే, పారిశుధ్య పనులకై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భారీ వర్షాలు పడే ఆస్కారం ఉన్నందున నీటి పారుదల కోసం డ్రైనేజీలను శుభ్రపరిచి మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడానికి కలిసికట్టుగా ముందుకు వస్తే బాగుంటుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.






