దేశంలో తొలి డిజిటల్ జనగణన ప్రారంభం

by Muthe.Rajitha |

దేశవ్యాప్తంగా మొదటి సంపూర్ణ డిజిటల్ జనగణన అధికారికంగా ప్రారంభమైంది.

దేశంలో తొలి డిజిటల్ జనగణన ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా మొదటి సంపూర్ణ డిజిటల్ జనగణన (Census 2027) అధికారికంగా ప్రారంభమైంది. స్వాతంత్రం తరువాత జరుగుతున్న 8వ జనగణన ఇది కాగా, మొత్తం మీద ఇది 16వది. ఈ భారీ ప్రక్రియను రెండు ప్రధాన దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు కొనసాగుతుంది, ఇందులో ఇళ్ల జాబితా (Houselisting) మరియు గృహ గణన (Housing Census) పనులను పూర్తి చేస్తారు. అనంతరం, రెండవ దశలో భాగంగా ఫిబ్రవరి 2027లో అసలైన జనాభా గణన (Population Enumeration) ప్రక్రియను చేపడతారు.

అయితే ఈసారి జనగణనలో అనేక సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టారు. మొదటిసారిగా కాగితం వాడకం లేకుండా పూర్తిగా స్మార్ట్‌ఫోన్ యాప్, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా డేటాను సేకరిస్తున్నారు. దీనివల్ల సమాచారం అత్యంత వేగంగా, ఖచ్చితంగా విశ్లేషించే అవకాశం ఉంది. ప్రజలు ఎన్యూమరేటర్ల కోసం వేచి చూడకుండా se.census.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి 'స్వీయ నమోదు' (Self Enumeration) చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. అలాగే, 1931 తర్వాత దేశంలో మొదటిసారిగా అన్ని కులాల గణనను ఈ ప్రక్రియలో చేర్చడం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచింది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షలకు పైగా ఎన్యుమరేటర్స్ పని చేస్తున్నారు. ప్రజలు తమ ఇంటికి వచ్చే అధికారులకు వివరాలు అందించవచ్చు లేదా ఆన్‌లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చు. దేశ భవిష్యత్తు ప్రణాళికలు, సామాజిక పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలు అత్యంత కీలకం కానున్నాయి. మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ పద్ధతి వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, పారదర్శకత కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story