- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ దేశంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, గత 12 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని బీజేపీ నాయకులు, మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్ అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ దేశంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, గత 12 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని బీజేపీ నాయకులు, మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, కామన్ సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి పలు కీలక అంశాలకు మోదీ ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం, విమానాశ్రయాల అభివృద్ధి, బుల్లెట్ రైలు ప్రాజెక్టు వంటి అనేక ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను చేపట్టిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు.
ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్ఠ పెరిగిందని, యుద్ధ పరిస్థితుల్లో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన ఘనత కూడా ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు కేటాయించిందన్నారు. ములుగు ఏజెన్సీ ప్రాంతానికి గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేయడం, అలాగే ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాలుగోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని, రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూక్య జవహర్‌లాల్, అజ్మీర కృష్ణవేణి నాయక్, రాష్ట్ర నాయకులు భూక్య రాజు నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు జింకల కృష్ణాకర్ రావు, అల్లే శోభన్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.






