ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై ప్రకటనను సీఎం ఉపసంహరించుకోవాలి

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, వాటిని కేవలం 4వేలకు కుదిస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూలో చేసిన ప్రకటనను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై ప్రకటనను సీఎం ఉపసంహరించుకోవాలి
X
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
  • టీజీపీఎస్సీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు పెంపు తగదు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, వాటిని కేవలం 4వేలకు కుదిస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూలో చేసిన ప్రకటనను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. తక్షణమే ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆలోచనను వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా ఆలోచించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆవాసాలకు సమీపంలోనే పాఠశాల అందుబాటులో ఉండాలని, ఈ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని విద్యా హక్కు చట్టం`2009లో ప్రాథమిక హక్కుల్లో పొందుపర్చారని గుర్తుచేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గ్రామీణ, పేద, దళిత, గిరిజన పిల్లల ప్రాథమిక విద్యా హక్కును కాలరాసే విధంగా ఉందని, దశాబ్దాలుగా తండాలు, గూడాలు, పల్లెల్లో నడుస్తున్న బడులను మూసివేస్తే డ్రాపౌట్ రేటు పెరిగి, విద్యకు దూరమౌతారని తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులే వుండాలని సూచించారు. అధికారంలోకి రాకముందు ప్రతి గ్రామంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తామని, ఏ ఒక్క పాఠశాలనూ మూసివేయబోమని, బడ్జెట్‌లో విద్యకు 15 శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రాగానే హామీలను తుంగలో తొక్కుతున్నదని విమర్శించారు. బడ్జెట్‌లో కనీసం 8.2 శాతం కూడా కేటాయించడంలేదని, బడులలో మౌలిక వసతులు లేవని, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. ప్రస్తుతం ఏకంగా పాఠశాలలనే మూసివేసే ఆలోచనకు పూనుకుని, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే చర్యలకు పాల్పడుతున్నదని, ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాల వుండే విధంగా ప్రజలకు నమ్మకం కల్గించి, ఎన్‌రోల్ పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజుల పెంపు భారం తగదు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజును రూ. 200 నుండి రూ.1,000 వరకు పెంచడాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ స్పందించి ఈ ఫీజు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, ఆర్థిక ఇబ్బందులతో కోచింగ్ సెంటర్లలో వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ నిరుద్యోగ యువత పరీక్షలకు సిద్ధమవుతున్నదని, దీనికి తోడు ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజును ఐదింతలు పెంచడం దారుణమన్నారు. వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల, అభ్యర్థులు ప్రతి దరఖాస్తుకు వేలాది రూపాయలు చెల్లించాల్సి వస్తోందని, ఇది నిరుద్యోగులపై మోయలేని భారాన్ని మోపడమేనని అన్నారు. తక్షణమే పెంచిన దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజును ఉపసంహరించుకుని పాత ఫీజు విధానాన్ని పునరుద్ధరించాలని, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే పూర్తిస్థాయి నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీపీఎం డిమాండ్ చేశారు.

Next Story