చర్లపల్లి స్టేషన్‌లో నేటి నుంచి యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్..

by Kodari Anjali |

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది

చర్లపల్లి స్టేషన్‌లో నేటి నుంచి యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్..
X

దిశ, సికింద్రాబాద్: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్ దక్షిణ టెర్మినల్‌ (ప్లాట్‌ఫాం నెం.9 వైపు) వద్ద యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లపై పెరుగుతున్న రద్దీని తగ్గించే ఉద్దేశంతో ఆధునిక సౌకర్యాలతో చర్లపల్లి టెర్మినల్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేషన్‌కు వచ్చే వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొత్త సౌత్ టెర్మినల్‌లో విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక ప్లాట్‌ఫారాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్రీమియం టాయిలెట్లు, డిజిటల్ సమాచార వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాల కోసం 6,622 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

ప్రతి వాహనానికి డిజిటల్ టికెట్ జారీ..

ప్రయాణికులను దించేందుకు లేదా ఎక్కించుకునేందుకు వచ్చే వాహనాలకు తొలి 20 నిమిషాలు పూర్తిగా ఉచితంగా అనుమతి ఉంటుంది. అయితే ఆ సమయం దాటితే రూ.50 నుంచి రూ.500 వరకు రుసుము వసూలు చేయనున్నారు. స్టేషన్ ఆవరణలోకి ప్రవేశించే ప్రతి వాహనానికి డిజిటల్ టికెట్ జారీ చేయడంతో పాటు ప్రవేశ, నిష్క్రమణ సమయాలతో కూడిన డిజిటల్ రశీదు అందజేయనున్నారు. అనధికార పార్కింగ్‌ను అరికట్టడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణికుల రాకపోకలను మరింత సులభతరం చేయడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయడం ద్వారా స్టేషన్ ముందు భాగంలో ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా చూడనున్నట్లు తెలిపారు. రైల్వే అధికారులు ప్రయాణికులు, వాహనదారులు కొత్త నిబంధనలను పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story