తెలంగాణలో ఈగల్ ఫోర్స్ దెబ్బ.. కోటి రూపాయల గంజాయి గుట్టురట్టు!

by Ramesh Naini |

ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు సాగుతున్న భారీ గంజాయి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను తెలంగాణ నార్కోటిక్స్ పోలీసు విభాగం ఈగల్ ఫోర్స్ బట్టబయలు చేసింది.

తెలంగాణలో ఈగల్ ఫోర్స్ దెబ్బ.. కోటి రూపాయల గంజాయి గుట్టురట్టు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు సాగుతున్న భారీ గంజాయి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను తెలంగాణ నార్కోటిక్స్ పోలీసు విభాగం ఈగల్ ఫోర్స్ బట్టబయలు చేసింది. ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని కొణిజర్ల పోలీసులతో కలిసి జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో సుమారు కోటి రూపాయల విలువైన 200 కిలోల 104 ప్యాకెట్లు ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ ఆపరేషన్‌లో ఐదుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయగా.. ప్రధాన సూత్రధారి, సప్లయర్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి గంజాయితో పాటు స్విఫ్ట్ డిజైర్, బొలెరో వాహనాలు, ఏడు మొబైల్ ఫోన్లు, రూ.2,800 నగదును పోలీసులు సీజ్ చేశారు.

18 నెలల నిఘా.. ఓ ఫోన్ కాల్‌తో కదలిక..

ఈ ముఠా పట్టివేత వెనుక ఈగల్ ఫోర్స్ అధికారుల 18 నెలలగా నిఘా ఉంచారు. గతంలో నల్గొండ జిల్లా విజయపురి టౌన్ పీఎస్‌లో 336 కిలోల గంజాయి కేసులో అమోల్ నానోబా గోరే, వసంత జాదవ్ అనే పాత నేరస్థులు ఉన్నారు. అప్పటి నుంచి వీరి కదలికలపై అధికారులు నిఘా ఉంచారు. ఇదే సమయంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన షేక్ అన్సార్ అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నాడంటూ ఓ పౌరుడు 1908 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ పక్కా సమాచారంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు ఈ రెండు ముఠాలకు ఉన్న లింకును పసిగట్టారు. జూన్ 7న సాయంత్రం స్విఫ్ట్ డిజైర్, బొలెరో వాహనాల్లో ఏపీ ఒడిశా బోర్డర్‌కు వెళ్లిన ఈ ముఠాను వెంబడించారు. వారు అక్కడ గంజాయిని లోడ్ చేసుకుని తెలంగాణ వైపు వస్తుండగా ఖమ్మం వద్ద కొణిజర్ల పోలీసుల సాయంతో అడ్డగించి పట్టుకున్నారు.

కిలోకు రూ.10 వేల డీల్..

పోలీసుల ప్రాథమిక విచారణలో.. మహారాష్ట్రలోని ఉద్గీర్‌కు చెందిన ప్రభు అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన ఫైనాన్షియర్ కింగ్‌పిన్. గంజాయిని రవాణా చేసేందుకు పాత నేరస్థులైన వసంత, అమోల్‌లను పావులుగా వాడుకున్నాడు. ఉద్గీర్‌కు సరుకు చేర్చితే కిలోకు రూ.10 వేల చొప్పున కమీషన్ ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. మార్చి నెలలో రాజమండ్రిలో ఒడిశాకు చెందిన సప్లయర్ దేవి సింగ్‌ తో వీరు డీల్ మాట్లాడుకున్నారు. గతంలో ఇదే మార్గంలో 100 కిలోల చొప్పున రెండు సార్లు విజయవంతంగా రవాణా చేశారు. ఈసారి ఏకంగా 200 కిలోల ఆర్డర్ కోసం వసంత జాదవ్ తన బ్యాంకు ఖాతా నుంచి ఒడిశాలోని చిత్రకొండ ఎస్బీఐలో ఉన్న సప్లయర్ అకౌంట్‌కు రూ.90 వేలు పంపగా, అమోల్ మరో లక్ష రూపాయలను వేరే వ్యక్తుల ఖాతాల ద్వారా బదిలీ చేసి ఫోన్‌లో డేటా డిలీట్ చేశాడు. ఈ సరుకును మహారాష్ట్రలోని ప్రభుకు అప్పగిస్తే.. వసంత, అమోల్‌లకు చెరో రూ.10 లక్షలు ముట్టేలా పక్కా ప్లాన్ వేశారు. ఆ డబ్బుతో ఇతర రవాణా ఖర్చులు, గ్యాంగ్ సభ్యులకు వాటాలు చెల్లించాల్సి ఉంది. కానీ ఈగల్ ఫోర్స్ ఎంట్రీతో వీరి ఆట కట్టింది.

అరెస్టయిన నిందితులు..

ఈ ఆపరేషన్‌లో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన అమోల్ నానోబా గోరే (35), లక్ష్మణ్ నాగ్నాథ్ కారే (26)లతో పాటు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన వసంత జాదవ్ (40), షేక్ అన్సార్ (32), షేక్ రహమత్ (30)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన ఫైనాన్షియర్ ప్రభు (మహారాష్ట్ర), సప్లయర్ దేవిసింగ్ (ఒడిశా) పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

ఈగల్ ఫోర్స్ ప్రజలకు విజ్ఞప్తి..

మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి తెలంగాణ యువతను కాపాడుకునేందుకు ప్రతి పౌరుడు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి విక్రయాలు, రవాణా జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా వాట్సాప్ నంబర్ 87126 71111 కు, అలాగే [email protected] ఈ-మెయిల్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వెబ్‌సైట్: https://eagleforce.tspolice.gov.in/. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడంతో పాటు, వారికి తగిన రివార్డు కూడా అందజేస్తామని, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఈగల్ ఫోర్స్ తెలిపింది.

Next Story