- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరేనా..?
ఏజెన్సీలోని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది.

దిశ, కొత్తగూడ : ఏజెన్సీలోని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఉన్నతాధికారులు స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయి అమల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి బలం చేకురుస్తూ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, ఉద్దేశ్యపూర్వకంగా గైర్హాజరు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది నిరుపేద ఏజెన్సీ వాసులు వైద్య సేవల కోసం ఇబ్బందులు పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
గిరిజన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని రాష్ట్ర మంత్రి సీతక్క వరుస సమీక్ష సమావేశాల్లో అధికారులను ఆదేశిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్ల పనితీరు పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధుల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులను హెచ్చరిస్తున్నారు. ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) అన్ని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు పూర్తిస్థాయిలో పనిచేయాలని, రెండో శనివారం కూడా సెలవు లేదని, ఎప్పుడైనా తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఉమ్మడి కొత్తగూడలో భిన్న పరిస్థితులు..
సకాలంలో వైద్య సేవలు అందించాలని, అందుబాటులో ఉండాలని మంత్రి స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వరుసగా ఆదేశాలు జారీ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు ఆశించిన మార్పు కనిపించడం లేదని గిరిజన గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఉమ్మడి కొత్తగూడ మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. వందలాది గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. అలాంటి ప్రాంతంలో వైద్య సేవల పై సందేహాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇప్పటికీ ఇన్‌చార్జి వైద్యాధికారులతో కొనసాగుతుండగా, మరోవైపు ప్రజలకు అవసరమైన సమయంలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజల వాదన ప్రకారం, అత్యవసర సమయంలో ఆసుపత్రికి వచ్చే రోగులకు స్పష్టమైన సేవల వ్యవస్థ కనిపించడం లేదని చెబుతున్నారు. ఏ రోజు ఏ వైద్యాధికారి విధుల్లో ఉంటారో తెలియని పరిస్థితి ఉందని వాపోతున్నారు.
ప్రభుత్వ లక్ష్యానికి గండి..
ఏజెన్సీ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవల కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. కానీ చివరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గకపోతే ఆ ఆదేశాల ప్రయోజనం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే గర్భిణి, పాము కాటుకు గురైన రైతు, జ్వరంతో వచ్చిన చిన్నారి... వీరికి వైద్య సేవలు తక్షణం అందేలా వ్యవస్థ పనిచేస్తుందా అనే అంశం పై ప్రజలు సమాధానం కోరుతున్నారు. ఇదే సమయంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన కొన్ని సౌకర్యాల నిర్వహణపైనా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రజారోగ్యానికి సంబంధించిన వ్యవస్థలో బాధ్యతాయుతమైన పర్యవేక్షణ అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి- పూనెం సందీప్ తుడుం దెబ్బ కొత్తగూడ మండల అధ్యక్షులు
మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వో పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ వాటిని అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి కొత్తగూడ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, సబ్‌సెంటర్ల పనితీరుపై ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణ చేపట్టి, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీ గిరిజన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు.






