కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : తెలంగాణ ఉద్యమకారులు

by Batti.Sumithra |

తెలంగాణ ఉద్యమకారుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఆడపు బాలస్వామి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : తెలంగాణ ఉద్యమకారులు
X

దిశ, ఆలేరు : ​తెలంగాణ ఉద్యమకారుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఆడపు బాలస్వామి అన్నారు. బుధవారం వారు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ​అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పింఛన్, హెల్త్ కార్డ్‌తో పాటు స్వాతంత్ర సమరయోధుల గుర్తింపు ఇస్తామని చెప్పి, గద్దెనెక్కి రెండున్నర ఏళ్లు దాటుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందే తప్ప కార్యాచరణ శూన్యమన్నారు. ఎప్పుడో వేయాల్సిన మంత్రివర్గ సబ్ కమిటీని మొన్ననే వేసి, చాలా రోజుల తర్వాత తొలిసారిగా సమావేశపరచడం ఉద్యమకారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న ఉదాసీనతకు అద్దం పడుతోందన్నారు. లాఠీ దెబ్బలు తిని, జైళ్లకు వెళ్లి, ఇళ్లను వదిలి తెలంగాణ కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారులను ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా గుర్తించాలని బంధుప్రీతికి తావు లేకుండా అర్హులందరికీ న్యాయం చేయాల డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉండి కూడా ఈ ప్రాంత ఉద్యమకారుల సమస్యల పై స్పందించకపోవడం శోచనీయమన్నారు.

​ఆలేరు గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. ఇక్కడ సబ్బండ వర్గాలు ప్రాణాలకు తెగించి పోరాడాయి. అలాంటి ఉద్యమకారులను విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవన్నారు. ఈ ​సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం, జిల్లా నాయకులు రచ్చ రామ్ నరసయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సీస మహేశ్వరి, మాజీ ఎంపీపీ కాసగళ్ల అనసూయ, మొరిగాడి అశోక్, మొరిగాడి సుజాత, నాయకులు దొంతుల ఎల్లేష్, పుట్టల కిష్టయ్య, ఎలుగల కుమారస్వామి, నీల రామన్న, గుజ్జు అశోక్ తదితరులు ఉన్నారు.

Next Story