శాశ్వత నివాసాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

by Batti.Sumithra |

మిర్యాలగూడ మండలంలోని జాలుబాయి తాండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (BLR) పాల్గొన్నారు.

శాశ్వత నివాసాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
X

దిశ, మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ మండలంలోని జాలుబాయి తాండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (BLR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు భూక్య కోటేష్, దీరావత్ మోహన్, భూక్య లచ్చు, భూక్య రమేష్, ఆడోత్ నాగ, భూక్య సక్కుబాయి, మాలోత్ నాగు కుటుంబాలకు చెందిన నూతన గృహాలను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులను అభినందించిన ఎమ్మెల్యే, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తోందని తెలిపారు.

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తమకు శాశ్వత నివాసం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే స్థానికంగా ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా నిరంతరం కృషి చేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులు, గ్రామస్తులతో కలిసి అల్పాహారం చేసి వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన అంశాల పై ప్రజలతో చర్చించి, ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story