- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిరిసిల్లలో మళ్లీ ఫుడ్ పాయిజన్ కలకలం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని ఓ మండి బిర్యాని సెంటర్‌లో భోజనం చేసిన 10 మంది యువకులు అస్వస్థతకు గురికావడంతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇల్లంతకుంట మండలం రామోజీపేట, సిరిసిల్ల అర్బన్ పెద్దబోనాల, కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామాలకు చెందిన యువకులు గురువారం జిల్లా కేంద్రంలోని బకాసుర మండి బిర్యాని సెంటర్లో బిర్యాని తిన్న అనంతరం వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడుతూ అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందరు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల ప్రాథమిక నిర్ధారణ ప్రకారం కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే బాధితులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. తాము బిర్యాని తిన్న అనంతరమే అస్వస్థతకు గురయ్యామని బాధితులు తెలిపారు.
ఫుడ్ సేఫ్టీ తనిఖీలపై ప్రశ్నలు..
జిల్లాలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఎక్కడ జరుగుతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యాని సెంటర్లలో తరచూ తనిఖీలు నిర్వహించి, ఆహార నాణ్యతను పరిశీలించాలని, కలుషిత ఆహారం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






