ఎస్సీ,ఎస్టీల సంక్షేమమే ప్రాధాన్యం..

by Taduka Kalyani |

ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు.

ఎస్సీ,ఎస్టీల సంక్షేమమే ప్రాధాన్యం..
X

దిశ,ఆదిలాబాద్ : ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలపై నమోదైన అట్రాసిటీ కేసుల దర్యాప్తు, విచారణలో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా పెండింగ్ కేసులను ప్రత్యేక దృష్టితో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు,రిజర్వేషన్ల అమలు, సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ముఖ్యంగా మారుమూల, గిరిజన ప్రాంతాల అర్హులందరికీ చేరేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు చట్టప్రకారం అందాల్సిన పరిహారం, పునరావాసం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని, అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోందన్నారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడీఏ పీవో మంద మకరందు, ఏఎస్పీ సాయి రుత్విక్ కొట్టే, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Next Story