- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యా వ్యవస్థను బ్రష్టుపట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విద్యా వ్యవస్థ బ్రష్టుపట్టిపోయిందని మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.

దిశ, శంకర్‌పల్లి : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విద్యా వ్యవస్థ బ్రష్టుపట్టిపోయిందని మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బుధవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జన్వాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దాతల సహకారంతో రూ.5 కోట్ల నిధులు సమీకరించి పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జూలై 23న మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా హాజరై భవనాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. పాఠశాలకు బస్సుల్లో వచ్చే విద్యార్థులకు సైకిళ్లు కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా విద్యాశాఖకు ఇప్పటికీ మంత్రి లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, పోలీసు శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేకుండానే ప్రభుత్వం కొనసాగుతోందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దిక్సూచి లేని నావలా మారిందని ఎద్దేవా చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిప్‌లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటి కోసం ప్రభుత్వం వద్ద నిధులు కూడా లేవా అని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 28 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందనే అంచనాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకపోవడం వల్ల కార్పొరేట్ పాఠశాలల సంఖ్య పెరుగుతోందని, దీంతో పేద విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజు నాయక్, ఎంఈఓ రవీందర్‌రావు, నాయకులు వెంకటేష్, ఇంద్రసేనారెడ్డి, గోపాల్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.






