ఆడబిడ్డ సూసైడ్ చేసుకున్నా పట్టించుకోవటం లేదు: కవిత

by Vemula.Srinu Prasad |

పెద్ద రైస్ మిల్లర్లతో ప్రభుత్వం, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు..

ఆడబిడ్డ సూసైడ్ చేసుకున్నా పట్టించుకోవటం లేదు: కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెద్ద రైస్ మిల్లర్లతో ప్రభుత్వం, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం కవితతో రైస్ మీల్లర్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో వందల కోట్లతో వ్యాపారం చేసే బాయిల్డ్ రైస్ మిల్లర్ల జోలికి ఈ ప్రభుత్వం వెళ్లటం లేదని.. వాళ్ల నుంచి దాదాపు రూ.4 వేల కోట్లు ప్రభుత్వానికి రావాల్సి ఉన్నా ఏమీ అనటం లేదని అన్నారు. కానీ, 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బకాయిలు ఉన్న చిన్న రైస్ మిల్లర్లను దొంగలను చూసినట్లు చూస్తున్నారని ఆరోపించారు. వారిపై ఎంక్వైరీ అంటూ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఈ బాధ తట్టుకోలేక కరీంనగర్‌లో ఒక ఆడబిడ్డ సూసైడ్ చేసుకున్నదని తెలిపారు.

అయినా.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం దిగిపోయే సమయంలో లక్షా 40 వేల టన్నుల దొడ్డు బియ్యం ఉండేవని.. ఫిలిప్పీన్స్‌కు ఆ ప్రభుత్వం కిలో రూ.48 చొప్పున అమ్మిందన్నారు. కానీ.. ఈ ప్రభుత్వం ఇప్పుడు రూ.24కు అని టెండర్ పెట్టిందని.. కొన్ని రోజులకే మళ్లీ రూ.21.70కే దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దానికి సంబంధించి కరీంనగర్ కు చెందిన ఒక రైస్ మిల్లర్‌కు టెండర్ అప్పగించారని చెప్పారు. ఈ బియ్యానికి సంబంధించి కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నదన్నారు. పెద్ద రైస్ మిల్లర్లతో కేటీఆర్, హరీశ్‌రావు కుమ్మక్కై మాట్లాడటం లేదన్నారు. తాము చిన్న రైస్ మిల్లర్ల తరఫునే మాట్లాడతామని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.

Next Story