- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుబ్బాక భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు
దుబ్బాకలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి 80 తులాల బంగారం, 5.5 కిలోల వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : దుబ్బాకలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి 80 తులాల బంగారం, 5.5 కిలోల వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసులో మరో నిందితుడిగా జైలు కానిస్టేబుల్‌ను చేర్చగా, అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.
సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక పట్టణానికి చెందిన మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు చింత రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లి ఇంటికి తాళం వేశారు. ఇదే అదనుగా భావించిన ధర్మాజీపేట గ్రామానికి చెందిన బిక్షపతి ఇంటి కిటికీ ఊచలను విరగగొట్టి లోనికి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలను అపహరించాడు. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ఇంట్లోని సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను కూడా వెంట తీసుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ విశ్లేషణతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 80 తులాల బంగారం, 5.5 కిలోల వెండి, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న రెండు ఆభరణాలు రోల్డ్ గోల్డ్‌గా తేలినట్లు సీపీ తెలిపారు.
దర్యాప్తులో నిందితుడు బిక్షపతి ఇటీవలే నిజామాబాద్ జైలు నుంచి విడుదలైనట్లు గుర్తించారు. అతడి విడుదలకు జైలు కానిస్టేబుల్ గోపాల్ సహకరించినట్లు విచారణలో వెల్లడైందని, దీంతో గోపాల్‌ను కేసులో ఏ-2గా చేర్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు బిక్షపతిపై సిద్దిపేట, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో మొత్తం 63 చోరీ కేసులు నమోదైనట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులను, దర్యాప్తు బృందాన్ని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు.






