మాదకద్రవ్య రహిత నిర్మాణానికి సమష్టి కృషి

by Batti.Sumithra |

మాదకద్రవ్య‌ రహిత సమాజ స్థాపనకు ప్ప్ర‌భుత్వం, విద్యాసంస్థలు, సమాజం, పౌరులు సమన్వయంతో ముందుకు సాగాల‌ని న‌ల్గొండ జిల్లా అద‌న‌పు ఎస్పీ జి.ర‌మేష్ పిలుపునిచ్చారు.

మాదకద్రవ్య రహిత నిర్మాణానికి సమష్టి కృషి
X

దిశ, నల్లగొండ క్రైం : మాదకద్రవ్య‌ రహిత సమాజ స్థాపనకు ప్ప్ర‌భుత్వం, విద్యాసంస్థలు, సమాజం, పౌరులు సమన్వయంతో ముందుకు సాగాల‌ని న‌ల్గొండ జిల్లా అద‌న‌పు ఎస్పీ జి.ర‌మేష్ పిలుపునిచ్చారు. న‌ల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ ప‌రిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) బుధ‌వారం నిర్వహించిన 'నషా ముక్త్ భారత్ అభియాన్' సమగ్ర అవగాహన కార్యక్రమంలో అద‌న‌పు ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు, యువ‌త చ‌దువుతో పాటు క్రీడ‌లు, ఇత‌ర ఆస‌క్తి ఉన్న అంశాలలో రాణించ‌డానికి కృషి చేయాల‌ని సూచించారు. చెడు స్నేహాల‌కు దూరంగా ఉండాల‌ని, త‌ల్లిదండ్రుల ఆశలు, ఆశ‌యాల‌ను దృష్టిలో పెట్టుకొని క‌ష్ట‌ప‌డి చ‌ద‌వాల‌ని కోరారు. వివిధ రంగాల‌లో ఉన్న‌త‌స్థానాల‌కు ఎదిగిన వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ దిశ‌గా అడుగులు వేయాల‌ని చెప్పారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ఆరోగ్యకరమైన, సురక్షితమైన, మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. అవగాహన, నివారణ, సరైన నిర్ణయాలు తీసుకోవడమే డ్రగ్స్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అత్యంత ప్రభావవంతమైన మార్గాలని ఆయ‌న పేర్కొన్నారు.

వ్యసనంతో పోరాడుతున్న వారికి అండగా నిలిచి, వారు గౌరవప్రదంగా తిరిగి సమాజంలో కలిసిపోయేలా సహాయం చేయాల్సిన ప్రాధాన్యతను ఆయ‌న గుర్తుచేశారు. మాదకద్రవ్యాల మహమ్మారిని అంతమొందించడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, సమష్టి కృషితోనే ఈ పోరాటంలో విజయం సాధించగలమని ఆయన స్పష్టం చేశారు. సీబీసీ సహాయ సంచాల‌కులు జి.కోటేశ్వ‌ర్‌రావు అధ్య‌క్ష‌త వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఈగ‌ల్ పోర్స్ డీఎస్పీ శంక‌ర్ యాద‌వ్ ప్ర‌త్యేక అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ నిరంతర నిఘాతో పాటు టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1908 ద్వారా ప్రజలు అందిస్తున్న సమాచారం రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నెట్‌వర్క్‌లను గుర్తించడానికి, వాటిని నిర్మూలించడానికి ఎంతగానో దోహదపడుతోందని తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా దేశ యువతకు పెద్ద ముప్పుగా మారిందని, నిందితులు ముఖ్యంగా విద్యార్థులను, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు విద్యార్థులలో, ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. నషా ముక్త్ భారత్ అభియాన్ మూడు ముఖ్యమైన స్తంభాల పై ఆధారపడి పనిచేస్తుందని డీఎస్పీ వివరించారు.

డ్రగ్స్ వ్యాపారుల పై కఠిన చర్యలు తీసుకోవడం, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, వ్యసనపరులకు విముక్తి కలిగించి పునరావాసం కల్పించడం ఇందులో ప్రధానమైనవని పేర్కొన్నారు. మాదకద్రవ్య‌ రహిత భారత స్వప్నాన్ని సాకారం చేసేందుకు పౌరులంతా అప్రమత్తంగా ఉంటూ, డ్రగ్స్ వ్యతిరేక చ‌ర్య‌ల‌కు చురుగ్గా మద్దతు ఇవ్వాలని కోరారు. విద్యార్థులు తెలంగాణ ఈగ‌ల్ ఫోర్స్ లో వాలంటీర్లుగా చేరాల‌ని కోరారు. మైభార‌త్ (నెహ్రు యువ కేంద్రం) జిల్లా యువ‌జ‌న అధికారి ఎం.గౌతం రెడ్డి మాట్లాడుతూ ఆన్‌లైన్, సైబర్ నేరాలతో పాటు డ్రగ్స్ వ్యసనం నేడు యువతకు, కుటుంబాలకు, దేశ భవిష్యత్తుకు పెద్దసవాలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, బలమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని, తోటివారిలో కూడా అవగాహన పెంచాలని ఆయన కోరారు. ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశా ప్రిన్సిపాల్ వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ డ్ర‌గ్స్ వ్య‌తిరేక ప్రచారంలో అందరూ చురుగ్గా పాల్గొని, ఇక్కడ తెలుసుకున్న విషయాలను తమ కుటుంబాలకు, సమాజానికి చేరవేయాలని కోరారు. తద్వారా నషాముక్త్ భారత్ నిర్మాణ సమష్టి కృషిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు వ్యాస‌ర‌చ‌న పోటీలు నిర్వ‌హించి గెలుపొందిన విద్యార్థుల‌కు అద‌న‌పు ఎస్పీ చేతుల మీదుగా స‌ర్టిఫ‌కెట్‌తోపాటు ఫ్రైజ్‌లు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో పోలీసు క‌ళాజాత బృందంతోపాటు య‌క్ష‌గానం బృందం ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకున్నాయి. ఈ కార్య‌క్రమంలో ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశా బోధ‌న సిబ్బంది విద్యాసాగ‌ర్‌, అజ‌య్‌, బోధ‌నేతర సిబ్బంది, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story