- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీ కంటెంట్‌కు ఇక సెన్సార్ కట్..! 'సత్లుజ్' వివాదంతో కేంద్రం కీలక యోచన
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే సినిమాలకు సైతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ధృవీకరణను తప్పనిసరి చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే సినిమాలకు సైతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ధృవీకరణను తప్పనిసరి చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘సత్లుజ్’ సినిమా చుట్టూ ముసిరిన వివాదమే ఇందుకు ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఐటీ నిబంధనలు-2021లో కీలక సవరణలు తీసుకురానున్నట్లు జాతీయ మీడియా సమాచారం.
‘సత్లుజ్’ వివాదం..
దిల్జిత్ దోసాంజ్ నటించిన ‘సత్లుజ్’ సినిమాకు సీబీఎఫ్‌సీ కొన్ని కట్స్ సూచించింది. సినిమా సెన్సార్ రివ్యూలో ఉండగానే జీ5 (ZEE5) ఓటీటీ సంస్థ దానిని స్ట్రీమింగ్ చేసింది. దేశ సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పు ఉందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఆదేశాలతో జులై 3న దానిని తొలగించింది. నిబంధనలు ఉల్లంఘించిన జీ5 పై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
చట్ట సవరణలకు సన్నాహాలు..
ప్రస్తుతం ఓటీటీ కంటెంట్ సీబీఎఫ్‌సీ పరిధిలోకి రాదు. సమాచార సాంకేతిక (ఐటీ) చట్టంలోని సెక్షన్ 69A ద్వారా మాత్రమే అభ్యంతరకర కంటెంట్‌ను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ క్రమంలో ఓటీటీలను సెన్సార్ పరిధిలోకి తెచ్చేందుకు నిబంధనలను సవరించనున్నారు.
పంజాబ్‌లో ప్రైవేట్ స్క్రీనింగ్‌లు..
1984-94 మధ్య పంజాబ్‌లో జరిగిన అనామక మృతదేహాల దహన సంస్కారాలపై దర్యాప్తు చేసి, 1995లో దారుణ హత్యకు గురైన మానవ హక్కుల కార్యకర్త ‘జస్వంత్ సింగ్ ఖాల్రా’ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, అక్కడ ఈ చిత్రాన్ని గురుద్వారాలు తదితర ప్రైవేట్ వేదికలపై ప్రదర్శిస్తుండటం రాజకీయ రంగు పులుముకుంది. అయితే, ధృవీకరణ లేని ఇలాంటి ప్రదర్శనలను అడ్డుకుని చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది.






