రాష్ట్రంలోనే ముల్కనూరు మహిళా పాల డెయిరీ ప్రథమ స్థానం..!

by Taduka Kalyani |

సహకార రంగంలో మహిళల శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా, వేలాది పాల ఉత్పత్తిదారుల కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలిచిన ములకనూరు మహిళా సహకార డెయిరీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

రాష్ట్రంలోనే ముల్కనూరు మహిళా పాల డెయిరీ ప్రథమ స్థానం..!
X

దిశ, భీమదేవరపల్లి: సహకార రంగంలో మహిళల శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా, వేలాది పాల ఉత్పత్తిదారుల కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలిచిన ములకనూరు మహిళా సహకార డెయిరీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2025–26 రాష్ట్ర స్థాయి పాల నాణ్యత పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నాణ్యత, పారదర్శక పాలన, రైతు సంక్షేమం, విలువ ఆధారిత పాల ఉత్పత్తుల తయారీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ గుర్తింపు దక్కింది. బుధవారం నిర్వహించిన 24వ వార్షిక మహాసభలో డెయిరీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణ, రైతు సంక్షేమ కార్యక్రమాలు, సిల్వర్ జూబ్లీ వేడుకలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ములకనూరు మార్కెటింగ్ సహకార సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించడం ములకనూరుకే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే గర్వకారణమన్నారు. మహిళా సభ్యుల అంకితభావం, రైతుల విశ్వాసం, ఉద్యోగుల సమష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. నాణ్యత, పారదర్శకత, రైతు సంక్షేమంలో ములకనూరు మహిళా డెయిరీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. డెయిరీ స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టులో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించి, విశేష సేవలందించిన సభ్యులు, పాల ఉత్పత్తిదారులు, ఉద్యోగులను సన్మానించనున్నట్లు ప్రకటించారు.

సభ్యులే డెయిరీకి వెన్నెముక.

డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ మాట్లాడుతూ, సభ్యుల విశ్వాసం, మహిళల ఐక్యత, రైతుల సహకారమే డెయిరీ అభివృద్ధికి మూలస్తంభమన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు డెయిరీ వేదికగా నిలుస్తోందని, రాష్ట్రంలోనే అగ్రగామి మహిళా సహకార డెయిరీగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను చిరస్మరణీయంగా నిర్వహించి డెయిరీ చరిత్రను భావితరాలకు పరిచయం చేస్తామని పేర్కొన్నారు.

206 గ్రామాలు.. 21,607 మంది సభ్యులు

డెయిరీ మేనేజర్ మార్పాటి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం 200 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, 206 గ్రామాల నుంచి 21,607 మంది సభ్యులు డెయిరీతో అనుబంధంగా ఉన్నారని తెలిపారు. గతంలో 70 వేల లీటర్ల పాలు సేకరించారు ఇప్పుడు రోజుకు 82 వేల లీటర్ల వరకు పాల సేకరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.194 కోట్ల వ్యాపారం నమోదు కాగా, రూ.18 కోట్ల లాభం ఆర్జించామని తెలిపారు. ఇందులో సభ్య రైతులకు రూ.15 కోట్ల బోనస్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. గత 24 ఏళ్లలో మొత్తం రూ.139 కోట్ల బోనస్ రైతులకు పంపిణీ చేశామని చెప్పారు.

ప్రతిరోజూ రైతుల నుంచి సుమారు రూ.30 లక్షల విలువైన పాలను కొనుగోలు చేసి, వాటిని పాలు, పెరుగు, నెయ్యి, వెన్న తదితర విలువ ఆధారిత పాల ఉత్పత్తులుగా తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సకాలంలో చెల్లింపులు చేస్తూ, పాల సేకరణ నుంచి విక్రయం వరకు పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట

పాల కొనుగోలుతో పాటు రైతుల సంక్షేమానికి డెయిరీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని భాస్కర్ రెడ్డి తెలిపారు. పశుదాణా సబ్సిడీలు, పశువైద్య సేవలు, పశు బీమా తదితర సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.17 కోట్ల వరకు వ్యయం చేసినట్లు వెల్లడించారు. సభ్యుల మరణానంతర కుటుంబాలకు దహన సంస్కార సహాయంగా రూ.16 లక్షలు, సహజ మరణం చెందిన 92 మంది సభ్యుల కుటుంబాలకు రూ.32 లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు.

గ్రామీణాభివృద్ధికి ఆదర్శం

చిన్న మహిళా సహకార సంఘంగా ప్రారంభమైన ములకనూరు మహిళా డెయిరీ, నేడు రాష్ట్రంలోనే అగ్రగామి మహిళా సహకార డెయిరీగా ఎదిగి వేలాది రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తోంది. నాణ్యమైన పాల ఉత్పత్తులు, పారదర్శక పాలన, రైతు సంక్షేమం, మహిళా సాధికారతకు సమాన ప్రాధాన్యం ఇస్తూ సహకార రంగంలో ఆదర్శంగా నిలుస్తోందని సభలో పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్లు, మహిళా సభ్యులు, పాల ఉత్పత్తిదారులు, డెయిరీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Next Story