- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యూచర్ సిటీ రైతులకు న్యాయం చేయాలి
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

దిశ, ఇబ్రహీంపట్నం : ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ కోసం భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మరింత పెంచాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రైతులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం తమ భూములను ఇచ్చి భాగస్వాములైన రైతులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే భూములు కోల్పోయిన రైతు కుటుంబాల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులతో నేరుగా చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలకు ముఖ్యమంత్రి సూచించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి భరోసా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.






