- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్లలో మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో గోదాముల సౌకర్యాన్ని విస్తరించేందుకు వచ్చే రెండేళ్లలో మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గోదాముల సౌకర్యాన్ని విస్తరించేందుకు వచ్చే రెండేళ్లలో మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్, హాకా కార్పొరేషన్‌ల మేనేజింగ్ డైరెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
ఆధీనంలో 52 స్వంత గోదాములు
ప్రస్తుతం రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఆధీనంలో 52 స్వంత గోదాములు ఉండగా, వాటి నిల్వ సామర్థ్యం 6 లక్షల మెట్రిక్ టన్నులని తెలిపారు. ప్రస్తుతం 104 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో 6.33 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణంగా 48 కొత్త గోదాముల నిర్మాణం కొనసాగుతోందన్నారు. తొలి దశలో 17 గోదాములను 2027 జనవరి నాటికి, రెండో దశలో 31 గోదాములను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి మొత్తం సుమారు 5.8 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యాన్ని కల్పిస్తామని వెల్లడించారు. భవిష్యత్ అవసరాల కోసం మరో 32 గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు
కొత్తగా నిర్మించే అన్ని గోదాములపై తప్పనిసరిగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి, రాష్ట్రంలోని ప్రభుత్వ కార్పొరేషన్ల ఆధీనంలోని గోదాములను సమన్వయంతో నిర్వహించి నిర్వహణ వ్యయాలు తగ్గించాలని సూచించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో శాస్త్రీయ విధానాల్లో గోదాముల నిర్మాణం చేపట్టడంతో పాటు నిల్వ సరకు నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని, రానున్న 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వేర్‌హౌసింగ్ మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశించారు.






