- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఎన్నికల ముందు నిరుద్యోగ డిక్లరేషన్ పేరుతో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు.

దిశ, పటాన్ చెరు టౌన్ : ఎన్నికల ముందు నిరుద్యోగ డిక్లరేషన్ పేరుతో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. బుధవారం పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 18న హైదరాబాద్‌లో నిర్వహించనున్న 'యువ సంగ్రామ సదస్సు'కు పటాన్ చెరు నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది యువతను తరలించనున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సరూర్‌నగర్ స్టేడియంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రకటించిన నిరుద్యోగ డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీలను ప్రభుత్వం నేటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు.
ఉద్యోగ నియామకాలలో జాప్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. యువత, రైతులు, మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. జూలై 18న జరిగే యువ సంగ్రామ సదస్సుకు పటాన్ చెరు పరిధిలోని మున్సిపాలిటీలు, డివిజన్లు, గ్రామాల నుంచి భారీ సంఖ్యలో యువత హాజరుకానున్నారని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సదస్సును విజయవంతం చేయాలని యువజన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలి..
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. ఇప్పటి వరకు దరఖాస్తులు సమర్పించని అర్హులైన ప్రతి ఓటరిని కలిసి దరఖాస్తులు నింపేలా చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఎస్‌ఐఆర్ అమలులో పటాన్ చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






