- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు ఉపయోగం లేకుండా పోయిన రైతు బజార్
ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతు బజార్లు నేడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థకు చేరుకున్నాయి.

దిశ, కామారెడ్డి: ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతు బజార్లు నేడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థకు చేరుకున్నాయి. నిర్వహణ బాధ్యత ఎవరిదో తేల్చకుండా మున్సిపల్, మార్కెట్ కమిటీ అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టుకుంటుండటంతో రైతు బజార్ పూర్తిగా నిరుపయోగంగా మారింది.
రెండు శాఖల మధ్య బంతిలా రైతు బజార్..
రైతు బజార్ నిర్వహణ, శుభ్రత, మరమ్మతుల బాధ్యత తమది కాదంటూ మున్సిపల్, మార్కెట్ కమిటీ అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతు బజార్‌లో కలుపు మొక్కలు పెరిగి, షెడ్లు దెబ్బతిని, విద్యుత్ సౌకర్యాలు కూడా లేకుండా పోయాయి.
రైతులకు ఉపయోగం లేని భవనం..
రైతులు నేరుగా వచ్చి తమ పంటను విక్రయించుకునేందుకు ఏర్పాటు చేసిన రైతు బజార్ ప్రస్తుతం వారికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు. ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంతో రైతులు మళ్లీ మధ్యదళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. బజార్‌కు కొనుగోలుదారులు కూడా రావడం లేదు.
రూ.50 లక్షల ప్రజాధనం వృథా..
రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సుమారు రూ.50 లక్షల ప్రజాధనంతో రైతు బజార్‌ను నిర్మించింది. అయితే సరైన నిర్వహణ లేకపోవడంతో ఆ భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. ప్రజాధనం ఇలా వృథా కావడంపై స్థానికులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్..
రైతు బజార్‌ను పునరుద్ధరించి, నిర్వహణ బాధ్యతను ఒకే శాఖకు అప్పగించాలని, రైతులకు ఉపయోగపడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
రైతు బజార్ విషయం మాకేం తెలియదు.. రాజశేఖర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి
రైతు బజార్ విషయం మాకేమీ తెలియదు. అంతా మున్సిపల్ అధికారులకే తెలుసు. మేము స్థలం మాత్రమే ఇచ్చాం. దాని నిర్వహణను మున్సిపల్ వారే చూసుకోవాలి.
రైతు బజార్ నిర్వహణతో మాకు ఎలాంటి సంబంధం లేదు.. పర్వతాలు, మున్సిపల్ కమిషనర్
రైతు బజార్ నిర్వహణతో మాకు ఎలాంటి సంబంధం లేదు. రైతు బజార్ నిర్వహణ, దాని ఖర్చులు, ఆదాయం, వ్యయాలన్నీ మార్కెట్ కమిటీ అధికారులే చూసుకోవాలి.






