కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టాయి

by Ratna Kumari |

కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయని, సంస్థకు చెల్లించాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టాయి
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయని, సంస్థకు చెల్లించాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ నిర్వహించిన సింగరేణి కార్మికుల భరోసా యాత్ర కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను భారీ అప్పుల ఊబిలోకి నెట్టాయని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు ఇతర బిల్లులు చెల్లించినా, సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలను చెల్లించలేదని విమర్శించారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ బ్యాంకుల నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకుని ఉద్యోగుల జీతాలు చెల్లించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

సింగరేణి ప్రాంతంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచినా, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా కార్మికులంతా ఐక్యంగా పోరాడి సంస్థను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ విద్యుత్ ఉత్పత్తిలో థర్మల్ విద్యుత్ కీలక పాత్ర పోషిస్తోందని, బొగ్గు ఉత్పత్తి ఆగిపోతే దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. పరిశ్రమలు సజావుగా నడవాలంటే బొగ్గు ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌తో పాటు ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకు కేటాయించారని గుర్తు చేశారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ ద్వారా సుమారు 50 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని, వేలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, రమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు యుగేందర్ రెడ్డి, నాయకులు గణపతి, చల్లా నారాయణరెడ్డి, సునీల్ రెడ్డి, గోమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story