- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జయశంకర్ సొంత గ్రామాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సొంత గ్రామమైన అక్కంపేట అభివృద్ధిని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని బీజేపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు విమర్శించారు.

దిశ, ఆత్మకూర్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సొంత గ్రామమైన అక్కంపేట అభివృద్ధిని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని బీజేపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు విమర్శించారు. ఆదివారం బీజేపీ ఆత్మకూర్ మండల అధ్యక్షుడు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కంపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తొలుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కంపేట గ్రామ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా గ్రామాన్ని సందర్శించినప్పుడు రెవెన్యూ గ్రామ హోదా, జూనియర్ కళాశాల, పశువైద్యశాల, ప్రభుత్వ ఆస్పత్రి, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు, మోడల్ గ్రామంగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు.
అధికారం మారినా ప్రజల పరిస్థితి మారలేదని, ప్రజలను మోసం చేసే రాజకీయాలు కొనసాగుతున్నాయని అన్నారు. అక్కంపేట గ్రామానికి వచ్చిన సమయంలో దళితుడు సిలువేరు జాన్ ఇంట్లో భోజనం చేసిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని కాళీ ప్రసాద్ రావు ఆరోపించారు. అనంతరం బీజేపీ బృందంతో కలిసి సిలువేరు జాన్ ఇంటిని సందర్శించి, ప్రభుత్వం ఏడాది లోపు ఇల్లు నిర్మించకపోతే తాను వ్యక్తిగతంగా సొంత ఖర్చుతో ఇల్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి, చౌల్లపల్లి సర్పంచ్ మోరె రాజేశ్వరరావు, ఆర్టీఐ యాక్ట్ జిల్లా కన్వీనర్ ఎదులపురం, మాజీ మండల అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం, మండల ప్రధాన కార్యదర్శులు బయ్యా పైడి ఆచార్య, రవ్వ శివప్రసాద్, బీజేవైఎం మండల అధ్యక్షుడు పోరెడ్డి ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






