ఐలయ్యకు మంత్రి పదవి వచ్చేలా కృషి చేస్తా : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

by Batti.Sumithra |

ఆలేరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి వచ్చేలా తాను కృషి చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

ఐలయ్యకు మంత్రి పదవి వచ్చేలా కృషి చేస్తా : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ఆలేరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి వచ్చేలా తాను కృషి చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వంగపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గతంలో ఆలేరు, భువనగిరి నియోజకవర్గ ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిపించారని గుర్తు చేశారు. రాజకీయాలు వేరు.. ప్రజాసేవ వేరని పేర్కొంటూ పదవుల కంటే ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమన్నారు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తనను నేరుగా సంప్రదించాలని కోరారు. ప్రభుత్వం పాలన ఒక ఎత్తయితే, ప్రజాసేవ మరో ఎత్తని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలేరు ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయనను ఈ ప్రాంత ప్రజలు భవిష్యత్‌లో మంత్రిగా చూడాలని అన్నారు. ఐలయ్యకు మంత్రి పదవి వచ్చేలా తాను పోరాడుతానని స్పష్టం చేశారు.

గతంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వద్ద వంగపల్లి అండర్‌పాస్‌ నిర్మాణం కోసం ఒత్తిడి తెచ్చామని, ప్రస్తుతం ఆ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రాన్ని మండల కేంద్రాలతో అనుసంధానించేలా డబుల్‌ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇరుకైన రహదారుల కారణంగా ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రహదారుల విస్తరణ చేపడుతున్నట్లు చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. రాష్ట్రంలో రూ.20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల నిర్మాణం చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా ఆలేరు ప్రాంతానికి రెండు కాలువలు కూడా తీసుకురాలేదని విమర్శించారు. కొండపోచమ్మసాగర్‌, మల్లన్నసాగర్‌లో నీరు ఉన్నప్పటికీ ఆలేరు రైతులకు అందించలేదన్నారు.

ప్రస్తుతం బస్వాపురం, గందమల్ల రిజర్వాయర్లకు నిధులు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని, గందమల్ల ప్రాజెక్టుతో ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. యాదగిరిగుట్టకు పలుమార్లు వచ్చినా కొండపైకే పరిమితమై, కొండ కింద అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కొత్తగా ఏర్పడిన మోటకొండూరు మండలాన్ని కూడా నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాలతో పాటు ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చామని తెలిపారు. భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, తెలంగాణ సాధించిన స్ఫూర్తితో అభివృద్ధి కోసం కూడా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికుంట్ల సత్యం, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ సరిత, యాదగిరిగుట్ట తహశీల్దార్ గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story