- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం గౌరవ అధ్యక్షుడు ఏనుగుల రాకేష్ రెడ్డి అధ్యక్షతన పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను పరిరక్షించేందుకు రాజకీయ జెండాలను పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం గౌరవ అధ్యక్షుడు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిని పార్టీలకతీతంగా ఖండించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడాలని పిలుపునిచ్చారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం, పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడానికి నిధులు లేవా అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య కేవలం విద్యార్థులు లేదా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల సమస్య మాత్రమే కాకుండా సామాజిక సమస్యగా మారిందని అన్నారు.
పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే పరిస్థితులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆగస్టు 15 వరకు ప్రభుత్వం బకాయిల విడుదలపై చర్యలు తీసుకోవాలని, అప్పటికీ స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ మినిమమ్ వేజెస్ జాతీయ కమిషన్ చైర్మన్ జన్ను జకారియా, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మంద కుమార్ మాదిగ, కాకతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ తిర్నారి శేషు, సీపీఐ జిల్లా నాయకుడు రాజమౌళి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కయ్య, ఎంపీసీఐ జిల్లా కార్యదర్శి హంసారెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మైస ఉపేందర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సుకుమార్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






