Nirmala Sitaraman: ప్రపంచ కంపెనీలకు భారత్ ఫస్ట్ ఛాయిస్

by S Gopi |

ఈ సెంటర్లు 23 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఏటా సుమారు 100 బిలియన్ డాలర్ల(రూ. 9.53 లక్షల కోట్ల) ఆదాయం ఆర్జిస్తున్నాయని వెల్లడించారు.

Nirmala Sitaraman: ప్రపంచ కంపెనీలకు భారత్ ఫస్ట్ ఛాయిస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోని సగానికి పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ) ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుతం దేశంలో 2,100కు పైగా జీసీసీలు పనిచేస్తుండగా, 2030 నాటికి వాటి సంఖ్యను దాదాపు 5,000కు పెంచే సామర్థ్యం భారత్‌కు ఉందని ఆమె తెలిపారు. ఇటీవల సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, ఈ సెంటర్లు 23 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఏటా సుమారు 100 బిలియన్ డాలర్ల(రూ. 9.53 లక్షల కోట్ల) ఆదాయం ఆర్జిస్తున్నాయని వెల్లడించారు. ఫోర్బ్స్ గ్లోబల్-2000 జాబితాలోని 500కుపైగా కంపెనీలు ఇప్పటికే భారత్‌లో జీసీసీలను ఏర్పాటు చేశాయని, 2024లో వారానికి ఒక కొత్త జీసీసీ ప్రారంభమైతే, ఇప్పుడు దాదాపు ప్రతిరోజూ ఒక కొత్త సెంటర్ ఏర్పడుతోందని పేర్కొన్నారు. అలాగే, ఫార్చ్యూన్ గ్లోబల్-2000 కంపెనీల్లో ఇంకా రెండు మూడొంతుల సంస్థలు భారత్‌లో జీసీసీ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె వివరించారు. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్.. దేశంలోని జీసీసీలు ఇకపై కేవలం బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాలకే పరిమితం కావడం లేదని, అంతర్జాతీయ స్థాయి పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఉత్పత్తుల అభివృద్ధి, పేటెంట్లు, గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్లకు కేంద్రాలుగా మారుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో ఎంటర్‌ప్రైజ్ ఏఐ ప్రొఫెషనల్స్‌కు భారత్ రెండో అతిపెద్ద కేంద్రంగా ఎదిగిందని, 2030 నాటికి భారత్ కేంద్రంగా పనిచేసే గ్లోబల్ సీనియర్ లీడర్‌షిప్ పోస్టుల సంఖ్య దాదాపు ఐదు రెట్లు పెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

Next Story