- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బహదూర్‌గూడ రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలి
బహదూర్‌గూడ రైతు భూ పోరాట సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక దీక్షా శిబిరాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదివారం రాత్రి సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు.

దిశ, శంషాబాద్: బహదూర్‌గూడ రైతు భూ పోరాట సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక దీక్షా శిబిరాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదివారం రాత్రి సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో సుమారు 1,400 ఎకరాల భూమిలో 650 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం అన్యాయమన్నారు. ఈ భూముల విషయంలో రైతులు హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చుకుని తొమ్మిది నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. కోర్టు ఆదేశాలను గౌరవించకుండా హైడ్రా వంటి సంస్థలను ఉపయోగించి రైతులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.
రాష్ట్రంలో హైడ్రా ద్వారా ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూమిని, ఎవరి నుంచి, ఏ ప్రాతిపదికన స్వాధీనం చేసుకున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను బెదిరించి భూములు తీసుకోవడం కాకుండా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు ఇవ్వకుండా, భూ హక్కులను నిర్ధారించకుండా బుల్డోజర్లు, బస్ టెర్మినల్, మెట్రో రైలు తదితర ప్రాజెక్టుల పేరుతో సాగుభూములను స్వాధీనం చేసుకోవడం సమంజసం కాదన్నారు. గతంలో జీవో 58, 59ల ద్వారా లక్షల ఎకరాల భూములను క్రమబద్ధీకరించి పట్టాలు, రిజిస్ట్రేషన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుతం వివాదాస్పదంగా ఉన్న భూములు ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా నమోదు కాలేదని, దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతుల నుంచి ప్రభుత్వం పన్నులు వసూలు చేసి, ఇప్పుడు అదే భూములపై హక్కులను ప్రశ్నించడం అన్యాయమని అన్నారు. బహదూర్‌గూడ రైతులకు న్యాయం జరిగే వరకు సీపీఐ అండగా ఉంటుందని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, రామస్వామి, రైతు సంఘం నాయకులు ప్రభులింగం, సత్యనారాయణ, ఆర్. యాదగిరి, నర్ర గిరి, అడ్వకేట్ సతీష్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, గ్రామ రైతులు కృష్ణమోహన్ రాజు, కేఎం రాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.






