AI: ఏఐ ఎఫెక్ట్.. రికార్డు స్థాయికి సాఫ్ట్‌వేర్, డేటాపై పెట్టుబడులు

by S Gopi |

2008 నుంచి ఇంటాంజిబుల్ ఆస్తులపై పెట్టుబడులు ఏటా సగటున 3.5 శాతం పెరుగుతుండగా, భౌతిక ఆస్తుల పెట్టుబడుల వృద్ధి 1 శాతానికే పరిమితమైంది.

AI: ఏఐ ఎఫెక్ట్.. రికార్డు స్థాయికి సాఫ్ట్‌వేర్, డేటాపై పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచ పెట్టుబడుల ధోరణిలో భారీ మార్పులకు కారణమవుతోంది. ఫ్యాక్టరీలు, యంత్రాలు వంటి భౌతిక ఆస్తుల కంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్, డేటా, పరిశోధన-అభివృద్ధి (ఆర్అండ్‌డీ), బ్రాండ్లు, డిజైన్, మేధో సంపత్తి వంటి ఇంటాంజిబుల్ అసెట్స్‌పై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డయూఐపీఓ) విడుదల చేసిన 'వరల్డ్ ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్‌మెంట్ హైలైట్స్–2026' నివేదిక ప్రకారం, అధ్యయనం చేసిన 29 ప్రధాన ఆర్థికవ్యవస్థల్లో ఈ పెట్టుబడుల విలువ 2025 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 953 లక్షల కోట్ల)కు పైగా చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. 2008 నుంచి ఇంటాంజిబుల్ ఆస్తులపై పెట్టుబడులు ఏటా సగటున 3.5 శాతం పెరుగుతుండగా, భౌతిక ఆస్తుల పెట్టుబడుల వృద్ధి 1 శాతానికే పరిమితమైంది. పెట్టుబడుల స్వరూపంలో ఇదొక శాశ్వత మార్పునకు సంకేతమని డయూఐపీఓ పేర్కొంది.

ఈ మార్పుకు ప్రధాన కారణం ఏఐ అని నివేదిక స్పష్టం చేసింది. ప్రారంభ దశలో ఏఐ డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, విద్యుత్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచుతున్నప్పటికీ, దీర్ఘకాలంలో సాఫ్ట్‌వేర్, డేటా, పరిశోధన, కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణలే వృద్ధికి ప్రధాన చోదకశక్తిగా మారనున్నాయని అంచనా వేసింది. 2013–2023 మధ్య అన్ని ఇంటాంజిబుల్ ఆస్తుల్లో సాఫ్ట్‌వేర్, డేటాబేస్‌ల పెట్టుబడులే అత్యంత వేగంగా పెరిగాయి. ఈ రంగంలో అమెరికా ఇప్పటికీ అగ్రస్థానంలో ఉండగా, జపాన్, జర్మనీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ ఈ పెట్టుబడుల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాలుగా డయూఐపీఓ గుర్తించింది. అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ వాణిజ్య అనిశ్చితి ఉన్నప్పటికీ, భవిష్యత్ ఆర్థిక వృద్ధికి ఏఐ ఆధారిత ఇంటాంజిబుల్ ఆస్తులే కీలక పెట్టుబడులుగా మారుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.

Next Story