వానాకాలమా... ఎండాకాలమా...?

by Batti.Sumithra |

వామ్మో... ఇదేమి ఉక్కపోత..! అసలు ఇది వేసవికాలమా..? వానాకాలమా..? అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉంది.

వానాకాలమా... ఎండాకాలమా...?
X

దిశ, భిక్కనూరు : వామ్మో... ఇదేమి ఉక్కపోత..! అసలు ఇది వేసవికాలమా..? వానాకాలమా..? అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. వానాకాలం ప్రారంభమై రెండు కార్తులు, మృగశిర, ఆరుద్ర, దాటిపోయి, మూడో కార్తి నడుస్తున్నప్పటికీ వర్షాలు జాడ లేకుండా పోవడం, వేసవికాలాన్ని మరిపించే విధంగా వానాకాలంలో ఎండలు దంచికొడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. కాలం ఆరంభంలో పెట్టుబడులు బాగా పెట్టి, దుక్కి దున్ని, చదును చేసి వేసిన మొక్కజొన్న, పత్తి పంటలు మొలకెత్తినప్పటికీ, ఆ తర్వాత వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పక్షం రోజుల క్రితం ఓ మోస్తరు వర్షాలు కురవడంతో మొక్కజొన్నతో పాటు పత్తి పంటకు డోకా లేదని భావించిన రైతులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాలు అడపాదడపా కురవడంతో వరి పంట సాగు కోసం తుకం సిద్ధం చేసి ఉంచారు. కొన్నిచోట్ల ముందుగానే తుకం సిద్ధం చేసిన రైతులు నాట్లు కూడా వేశారు. ఆ తర్వాత కురిసిన తేలికపాటి వర్షాలకు పొలాల్లో తుకం పోయగా, పక్షం రోజులుగా వర్షాల జాడ లేకపోవడంతో ఎండిపోయే పరిస్థితి నెలకొంది.

సాగు కోసం ఖర్చు చేసిన పెట్టుబడులు కూడా ప్రస్తుత పరిస్థితులను బట్టి తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ బావుల వద్ద పరిస్థితి ఒకవైపు ఉంటే, ఇళ్లలోకి వచ్చి కాస్త ఉపశమనం పొందుదామనుకున్నా భరించలేని వేడిమి నెలకొంది. ఫ్యాన్లు రోజంతా తిరుగుతున్నా, ఇళ్లలో ఏసీలు, కూలర్లు నడుస్తున్నా ఉక్కపోత నుంచి ఉపశమనం లభించడం లేదు. కొద్ది రోజుల క్రితం వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ఈసారి కాలం కలిసివస్తుందన్న నమ్మకంతో చాలామంది రైతులు పొలాలను రొప్పి చేసి వివిధ రకాల విత్తనాలు వేశారు. అయితే ఆ తర్వాత వర్షాలు పడకపోవడంతో, కమ్ముకుంటున్న మేఘాల వైపు చూస్తూ వర్షం పడుతుందేమోనన్న చిన్న ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. మబ్బులు కమ్ముకున్నా వర్షం జాడ లేకపోవడంతో ఈసారి కాలం అవుతుందో లేదోనన్న టెన్షన్ రైతుల్లో నెలకొంది.

పరిస్థితులు రోజురోజుకూ ప్రతికూలంగా మారుతుండడంతో, ఈసారి గట్టెక్కేదెలా అంటూ రైతులు తలలు పట్టుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడులతో పాటు చేసిన కష్టం వృథా అయ్యే పరిస్థితులు నెలకొనడం, అప్పుల భారం పెరిగిపోయే అవకాశాలు ఉండడంతో రైతులకు కంటికి కునుకు లేకుండా పోతోంది. ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండడంతో వేసిన మొక్కజొన్న, పత్తి పంటలు నేలవాలుతున్నాయి. దీంతో రైతులు కాలం ఇలా కావొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సతాయిస్తున్న బోర్లు...

మండిపోతున్న ఎండలకు బోర్లు సైతం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇదివరకు ఫుల్‌గా నీళ్లు ఇచ్చే బోర్లు ప్రస్తుతం తక్కువగా నీరు ఇస్తున్నాయి. దీంతో నీటి లభ్యతను బట్టి సాగు చేయాలని చాలామంది రైతులు నిర్ణయించుకున్నారు. కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లోని అన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో మాదిరిగా ఎకరాల కొద్దీ సాగు చేయకుండా, నీటి సామర్థ్యాన్ని బట్టి సాగు చేయాలని మరికొందరు రైతులు భావిస్తున్నారు.

Next Story