మాలల హక్కుల సాధనలో రాజీపడే ప్రసక్తే లేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

by Kodari Anjali |

మాలల హక్కుల పరిరక్షణే తన ప్రథమ కర్తవ్యమని, పదవుల కంటే మాలల పక్షాన నిలబడటమే ముఖ్యమని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.

మాలల హక్కుల సాధనలో రాజీపడే ప్రసక్తే లేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
X

దిశ, భద్రాచలం: మాలల హక్కుల పరిరక్షణే తన ప్రథమ కర్తవ్యమని, పదవుల కంటే మాలల పక్షాన నిలబడటమే ముఖ్యమని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. భద్రాచలంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు, రోస్టర్ విధానం రద్దు, మాలల ఐక్యత కోసం చేపట్టిన ర్యాలీ, బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుతో కలిసి సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. రోస్టర్ విధానంతో మాలలకు జరుగుతున్న అన్యాయంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర దామాషా ప్రకారం కాకుండా, కొన్ని సెక్టార్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం వల్ల మాలలకు అన్యాయం జరిగిందని అన్నారు. కేటగరైజేషన్ ప్రకారం దక్కాల్సిన 5 శాతం వాటాలో, రోస్టర్ విధానం ద్వారా కేవలం 2.8 శాతమే అందుతోందని, దీనివల్ల మాలలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో కేబినెట్ సబ్ కమిటీకి సీఎం ఆదేశించారని అన్నారు. నేడు అనగా మంగళవారం ఈ అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని చర్చించి, న్యాయం జరిగేలా త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మాలలందరూ ఐక్యంగా ఉండాలని, ఉద్యోగస్థులు సైతం చొరవగా ఉద్యమాల్లో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. మాల జాతికి అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Next Story