- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Airtel: డేటా సెంటర్లు, క్లౌడ్, ఫిన్‌టెక్‌పై ఎయిర్‌టెల్ టార్గెట్
ఎయిర్‌టెల్ మనీకి ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి ఎన్‌బీఎఫ్‌సీ అనుమతి లభించగా, ఈ వ్యాపారంలో రాబోయే కాలంలో రూ. 20,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ టెలికాం సేవలకే పరిమితం కాకుండా భవిష్యత్తు టెక్నాలజీపై దృష్టి సారించనున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసులే భవిష్యత్తు వృద్ధికి ప్రధాన చోదక శక్తులని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. కంపెనీ 2025-26 వార్షిక నివేదికలో చైర్మన్ సునీల్ మిట్టల్ మాట్లాడుతూ, గత దశాబ్దంలో డిజిటల్ మౌలిక సదుపాయాలపై రూ. 3.3 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిన ఎయిర్‌టెల్ ఇప్పుడు ఆ పెట్టుబడిని కొత్త వ్యాపారాల ద్వారా ఆదాయంగా మార్చుకునే దశలో ఉందన్నారు. ఎయిర్‌టెల్ మనీకి ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి ఎన్‌బీఎఫ్‌సీ అనుమతి లభించగా, ఈ వ్యాపారంలో రాబోయే కాలంలో రూ. 20,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మరోవైపు నెక్స్‌ట్రా డేటా సెంటర్ల సామర్థ్యాన్ని ప్రస్తుత 300 మెగావాట్ల నుంచి 1 గిగావాట్‌కు పెంచే ప్రణాళికతో పాటు, ఇందుకోసం ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల(రూ. 9,500 కోట్ల) నిధులను సమీకరించింది. దేశంలో పెరుగుతున్న క్లౌడ్ వినియోగం, డేటా లోకలైజేషన్ అవసరాలు, ఏఐ విస్తరణను అవకాశంగా మార్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఎయిర్‌టెల్ క్లౌడ్ సేవలకు మార్కెట్ నుంచి మంచి స్పందన లభిస్తోందని, 5జీ కస్టమర్ల సంఖ్య 18.8 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది. అడోబ్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, మెటా, ఐబీఎం, ఒరాకిల్, నోకియా, ఎరిక్సన్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలతో భాగస్వామ్యాల ద్వారా డిజిటల్ సేవలను మరింత విస్తరించాలని లక్ష్యంగా ఉన్నట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది.






