- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Russian Crude: రష్యా చమురు కొనుగోళ్లలో రికార్డు
జూన్‌లో భారత్ 4.5 బిలియన్ యూరో(రూ. 49 వేల కోట్ల) విలువైన రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది మే నెలతో పోలిస్తే 34 శాతం ఎక్కువ.

దిశ, బిజినెస్ బ్యూరో: రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లు మరోసారి రికార్డు స్థాయిలో పెరిగాయి. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక ప్రకారం, జూన్‌లో భారత్ 4.5 బిలియన్ యూరో(రూ. 49 వేల కోట్ల) విలువైన రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది మే నెలతో పోలిస్తే 34 శాతం ఎక్కువ. మొత్తం 5.5 బిలియన్ యూరోల(రూ. 60 వేల కోట్ల) రష్యా శిలాజ ఇంధన దిగుమతుల్లో ముడి చమురు వాటా 83 శాతంగా ఉంది. దీంతో చైనా తర్వాత రష్యా చమురు ఉత్పత్తులకు భారత్ రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీకి రష్యా చమురు సరఫరాలు 150 శాతం పెరగ్గా, ఇండియన్ ఆయిల్ పారాదీప్ రిఫైనరీలో 126 శాతం, బీపీసీఎల్ కొచ్చి రిఫైనరీలో 83 శాతం, నయారా ఎనర్జీ వడినార్ రిఫైనరీలో 45 శాతం వృద్ధి నమోదైంది. భారత్ కొనుగోళ్లు పెరగడంతో జూన్‌లో రష్యా ముడి చమురు ఎగుమతుల పరిమాణం 14 శాతం పెరిగింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో రష్యా ఆదాయం మాత్రం 8 శాతం పడిపోయి రోజుకు 348 మిలియన్ యూరోలకు పరిమితమైంది. మరోవైపు, రష్యా చమురును శుద్ధి చేసిన ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు పంపడంలో భారత రిఫైనరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జామ్‌నగర్ రిఫైనరీ నుంచి తయారైన జెట్ ఇంధనాన్ని తొలిసారిగా బ్రిటన్ దిగుమతి చేసుకుంది. జూన్‌లో రష్యా శిలాజ ఇంధనాల అతిపెద్ద కొనుగోలుదారుగా చైనా 7.3 బిలియన్ యూరోలతో ముందుండగా, భారత్ 5.5 బిలియన్ యూరోల కొనుగోళ్లతో రెండో స్థానంలో నిలిచింది.






