ప్రశాంతంగా ముగిసిన కేజీబీవీ - యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ప్రవేశ పరీక్ష

by Malleboina Mahesh |

కేజీబీవీ - యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష ప్రశాంతం.. 80.59% హాజరుతో ముగిసిన ఎగ్జామ్!

ప్రశాంతంగా ముగిసిన కేజీబీవీ - యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ప్రవేశ పరీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ - యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (కేజీబీవీ-వైఐఐఓఈ) లలో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ పరీక్షకు 80.59 శాతం హాజరు నమోదైనట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ పరీక్షకు 6,563 ధరఖాస్తులు రాగా, 5,289 మంది విద్యార్థినులు హాజరయ్యారు. కేజీబీవీ - యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నూతన విధానం కింద ప్రతి జిల్లాలో విద్యార్థినుల భవిష్యత్తు కోసం ప్రత్యేక శిక్షణను అందుబాటులోకి తెచ్చారు.

ప్రతి జిల్లాలో ఒక కేజీబీవీ-వైఐఐఓఈ కేంద్రాన్ని జేఈఈ, ఈఏపీసెట్, కోచింగ్ కోసం కేటాయించారు. మరో కేంద్రాన్ని నీట్, ఈఏపీసెట్ శిక్షణ కోసం కేటాయించారు. ఇంకొక కేంద్రాన్ని క్లాట్ ప్రవేశ పరీక్షల కోచింగ్ కోసం ప్రత్యేకించారు. ఈ ప్రత్యేక కోర్సుల విభాగాలలో ఒక్కో దానికి 20 సీట్ల చొప్పున ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా జిల్లా వారీగా అడ్మిషన్లు కల్పిస్తారు. విద్యార్థినులు తమ దరఖాస్తు ఫారమ్‌లలో నమోదు చేసుకున్న ప్రాధాన్యతలు, మెరిట్, సీట్ల లభ్యతను బట్టి ఆయా ప్రత్యేక కేజీబీవీ-వైఐఐఓఈ లలో సీట్లను కేటాయిస్తారు. అడ్మిషన్లకు సంబంధించిన తదుపరి షెడ్యూల్‌ను నిబంధనల ప్రకారం విడిగా త్వరలోనే ప్రకటిస్తామని డైరెక్టర్ తెలిపారు.

Next Story