పవన్ కళ్యాణ్‌ శస్త్రచికిత్సపై కోకిలాబెన్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల

by Malleboina Mahesh |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబైలో భుజానికి విజయవంతమైన సర్జరీ.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కోకిలాబెన్ ఆసుపత్రి!

పవన్ కళ్యాణ్‌ శస్త్రచికిత్సపై కోకిలాబెన్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) కు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే. ఆయన కుడి భుజానికి జూలై 11, 2026 శనివారం విజయవంతంగా శస్త్రచికిత్స (Surgery) జరిగినట్లు ఆసుపత్రి వర్గాలు ఆదివారం ఒక అధికారిక హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించాయి. ఆసుపత్రి హెల్త్ బులెటిన్ ప్రకారం.. పవన్ కళ్యాణ్ కొంతకాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలలో ఆయన కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ (Rotator Cuff) తీవ్రంగా దెబ్బతిన్నట్లు తేలింది.

సుప్రాస్పినాటస్, ఇన్‌ఫ్రాస్పినాటస్ టెండన్ (Tendons) పూర్తిగా చిరిగిపోవడంతో పాటు, భుజం ఎముక (Greater Tuberosity) వద్ద చిన్న ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు గుర్తించారు. దీనితో జూలై 11న కోకిలాబెన్ ఆసుపత్రి ఆర్థ్రోస్కోపీ & షోల్డర్ సర్వీసెస్ డైరెక్టర్, ప్రసిద్ధ సర్జన్ డాక్టర్ దిన్షా పార్దివాలా నేతృత్వంలోని బృందం ఆయనకు విజయవంతంగా 'ఆర్థ్రోస్కోపిక్ రిపేర్' శస్త్రచికిత్సను పూర్తి చేసింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

నాలుగు నెలల పాటు పునరావాస చికిత్స..

సర్జరీ అనంతరం పవన్ కళ్యాణ్‌కు వైద్యులు కొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతిని ముంబైలోనే సూచించారు. భుజం మునుపటిలా సాధారణ స్థితికి రావడానికి, పూర్తి స్థాయిలో పనిచేయడానికి రాబోయే నాలుగు నెలల పాటు ఆయన ఒక క్రమబద్ధమైన 'షోల్డర్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్' (ఫిజియోథెరపీ, పునరావాస ప్రక్రియ) లో పాల్గొనవలసి ఉంటుందని డాక్టర్ దిన్షా పార్దివాలా బులెటిన్‌లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరిగిందనే వార్త తెలియడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Next Story