ఆస్కార్ విన్నర్ డైరెక్షన్‌లో దిశా పటానీ.. హాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

ఇండస్ట్రీలో అదృష్టం కూడా ఒక ముఖ్యమైన అంశమే అయినప్పటికీ.. కేవలం పేరు, ఇమేజ్ ఉంటే సరిపోదు, అక్కడ అవకాశాలు రావు.

ఆస్కార్ విన్నర్ డైరెక్షన్‌లో దిశా పటానీ.. హాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గ్లామర్, యాక్షన్, డ్యాన్స్‌తో విపరీతమైన క్రేజ్‌ను రాబట్టుకున్నారు. ఇటీవల ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్న దిశా హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ‘హాలీగార్డ్స్ సాగా:ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్’ చిత్రంతో హాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ భారీ చిత్రంలో కెవిన్ స్పేసీతో పాటు డాల్ఫ్ లండ్‌గ్రెన్, టైరెస్ గిబ్సన్, బ్రియానా హిల్డెబ్రాండ్, ఎరిక్ రాబర్ట్స్ వంటి అంతర్జాతీయ నటీనటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అతీంద్రియ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీని ఆస్కార్ విన్నర్ స్పేసీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న దిశా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘హాలీవుడ్‌లో ఆడిషన్స్ ప్రక్రియ చాలా పక్కాగా, పద్ధతిగా ఉంటుంది. మనం ఏ ఏజెన్సీతో కాంట్రాక్ట్ సైన్ చేశాం అనేదానిపై కూడా మనకు వచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను నిరూపించుకోవడం తప్పనిసరి.

ఇండస్ట్రీలో అదృష్టం కూడా ఒక ముఖ్యమైన అంశమే అయినప్పటికీ.. కేవలం పేరు, ఇమేజ్ ఉంటే సరిపోదు, అక్కడ అవకాశాలు రావు. ప్రతి నటుడు తన అసలు సామర్థ్యాన్ని ఆడిషన్‌ల ద్వారానే చూపించాల్సి ఉంటుంది. ఇండియాలో కూర్చుని హాలీవుడ్ అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టం. ఆన్‌లైన్‌లో ఆడిషన్‌లు ఇవ్వడం సాధ్యమే అయినప్పటికీ, కేవలం ఇక్కడే ఉండిపోకుండా అక్కడికి వెళ్లి, కొన్నాళ్లు ఉండి ప్రయత్నిస్తేనే ప్రత్యక్షంగా పాల్గొనే వీలుంటుంది. దీనివల్ల అవకాశాలు మరింత మెరుగ్గా వస్తాయి’’ అని చెప్పుకొచ్చారు. అలాగే ప్రతిరోజూ ఉదయాన్నే కెవిన్ స్పేసీ తమతో కూర్చుని ఆ రోజు తీయబోయే సీన్ గురించి పూర్తిగా వివరించేవారని దిశా గుర్తుచేసుకున్నారు. తన గత సినిమాల్లో ఏ దర్శకుడితోనూ తాను ఇలాంటి ప్రత్యేకమైన అనుభవాన్ని పొందలేదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ పద్ధతి వల్ల పాత్రను మరింత బాధ్యతాయుతంగా అర్థం చేసుకుని నటించడానికి వీలైందని చెప్పారు.

Next Story