డ్రగ్స్‌పై యుద్ధం ముమ్మరం.. రద్దీ ప్రాంతాల్లో ఎల్ఈడీ వాహనాలతో వినూత్న ప్రచారం

by Ramesh Naini |

యువత భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.

డ్రగ్స్‌పై యుద్ధం ముమ్మరం.. రద్దీ ప్రాంతాల్లో ఎల్ఈడీ వాహనాలతో వినూత్న ప్రచారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: యువత భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. సోషల్ మీడియాకే పరిమితం కాకుండా నేరుగా ప్రజల వద్దకే వెళ్లి అవగాహన కల్పించేందుకు ఎల్ఈడీ డిస్‌‌ప్లే వాహనాలతో వినూత్న ప్రచారం చేస్తున్నారు. నగరంలోని రామగోపాల్‌పేట, నల్లగుట్ట, ఎం.ఎస్. మఖ్త, లేక్ వ్యూ, సచివాలయం పరిధిలోని కీలక ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలోని పోలీసు బృందం రద్దీ ప్రాంతాలను ఎంచుకుని ఈ సామాజిక ప్రచారాన్ని బలోపేతం చేస్తోంది.

పిల్లల కదలికలపై నిఘా ఉంచాలి

ఈ ప్రచారంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లు, బస్ స్టాప్‌ల వద్ద ఎల్ఈడీ డిజిటల్ వాహనాలను ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, అవి జీవితాలను ఎలా ధ్వంసం చేస్తాయో వివరించే ప్రభావవంతమైన వీడియోలు, ప్రకటనలను ఈ వాహనాల ద్వారా ప్రదర్శించారు. విద్యార్థులు, నిత్యం ప్రయాణించే కూలీలు, ఉద్యోగులు అందరికీ ఈ సందేశం చేరేలా డిజిటల్ ప్రదర్శనలతో పాటు కాలనీలు, పార్కులు, విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున కరపత్రాల పంపిణీ, పోస్టర్ల ఏర్పాటు చేపట్టారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచడంలో పౌరుల పాత్ర ఎంత కీలకమో పోలీసులు ఈ సందర్భంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా సచివాలయం వంటి పరిపాలనా కేంద్రాల వద్ద సాయంత్రం వేళల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులను సైతం చైతన్యపరచడమే దీని ముఖ్య ఉద్దేశం. నివారణకు అవగాహనే మొదటి మెట్టు అని, సమాజంలో బలమైన ప్రతిఘటన ఉన్నప్పుడే డ్రగ్స్ మహమ్మారిని అడ్డుకోగలమని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో పోలీసులు చేస్తున్న ఈ కృషి పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. యువత పెడదారి పడుతున్న ప్రస్తుత తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని పోలీసులు కోరుతున్నారు.

వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం

మాదకద్రవ్యాల సరఫరా లేదా వాడకానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని ఈగల్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం 1908 టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు, 87126 71111 వాట్సాప్ నంబర్‌ను, [email protected] ఈమెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, నమ్మదగిన సమాచారం ఇచ్చిన వారికి తగిన బహుమతులు కూడా అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, యువతను ఈ వ్యసనాల నుంచి కాపాడటమే తమ ప్రాధాన్యతని పోలీసులు పునరుద్ఘాటించారు.

Next Story