శంకర ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం

by Ratna Kumari |

ఏటూరు నాగారం మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా దేవాలయం ఆధ్వర్యంలో, శంకర ఐ హాస్పిటల్ సహకారంతో, రాహుల్ ఐ ఫౌండేషన్ ప్రోత్సాహంతో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది.

శంకర ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం
X

దిశ, ఏటూరు నాగారం : ఏటూరు నాగారం మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా దేవాలయం ఆధ్వర్యంలో, శంకర ఐ హాస్పిటల్ సహకారంతో, రాహుల్ ఐ ఫౌండేషన్ ప్రోత్సాహంతో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. సాయిబాబా దేవాలయ కమిటీ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ కుమారుడు పెండ్యాల పవన్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏటూరు నాగారం మండలంతో పాటు పరిసర ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో **80 మందికి కంటి శస్త్రచికిత్స అవసరమని** వైద్యులు నిర్ధారించారు. వారికి భోజన వసతి కల్పించి, ప్రత్యేక బస్సు ద్వారా హైదరాబాద్‌లోని శంకర ఐ హాస్పిటల్‌కు ఉచిత శస్త్రచికిత్స కోసం తరలించినట్లు దేవాలయ కమిటీ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ తెలిపారు.

గత రెండేళ్లుగా ప్రతి నెలా ఒక రోజు ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, వాటి ద్వారా ఇప్పటికే 800 మందికి పైగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించి వారికి చూపు ప్రసాదించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ప్రతి నెలా నిర్వహించే ఉచిత కంటి పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర ఐ హాస్పిటల్ వైద్య బృందం, రాహుల్ ఐ ఫౌండేషన్ చైర్మన్ రాహుల్, శ్రీ సాయిబాబా దేవాలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.

Next Story