ఫిఫా వరల్డ్ కప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా, ఇంగ్లాండ్

by Harish |

ఫిఫా వరల్డ్ కప్-2026 సెమీస్ పోరు ఆసక్తికరంగా మారింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా, ఇంగ్లాండ్
X

దిశ, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్ కప్-2026 సెమీస్ పోరు ఆసక్తికరంగా మారింది. టైటిల్ ఫేవరెట్స్‌గా పరిగణించబడిన నాలుగు జట్లు సెమీస్‌లో అడుగుపెట్టాయి. ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్ టాప్-4కు చేరుకున్నాయి. తాజాగా డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, ఇంగ్లాండ్ సెమీస్‌‌కు దూసుకొచ్చాయి. ఆదివారం క్వార్టర్ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్‌‌ను అర్జెంటీనా మట్టికరిపించగా.. నార్వేపై ఇంగ్లాండ్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ నాలుగు జట్లు ఫైనల్ బెర్త్ కోసం పోటీపడనున్నాయి. ఈ నెల 15న ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య తొలి సెమీస్, 16న ఇంగ్లాండ్, అర్జెంటీనా మధ్య రెండో సెమీస్ జరగనున్నాయి.

ఎదురులేని అర్జెంటీనా

డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా వరుసగా రెండోసారి టైటిల్ గెలవాలన్న పట్టుదలతో ఆడుతోంది. టోర్నీలో ఆ జట్టుకు ఎదురులేకుండా పోయింది. క్వార్టర్స్ ఫైనల్‌లో స్విట్జర్లాండ్‌ను 3-1తో చిత్తు చేసింది. ఈ గేములో అర్జెంటీనా ఆధిపత్యం ప్రదర్శించినా స్విట్జర్లాండ్ కూడా పోరాడింది. డిఫెండింగ్ చాంపియన్ 23 సార్లు గోల్ కోసం ప్రయత్నించగా.. స్విస్ జట్టు 13 సార్లు గోల్ పోస్టుపై దాడి చేసింది. మ్యాచ్ ప్రారంభమైన 10 నిమిషాలకే అర్జెంటీనా ప్లేయర్ అలెక్సిస్ అలిస్టర్ గోల్ చేశాడు. చాలా సేపు ఆ జట్టు 1-0తో ఆధిక్యంలో ఉంది. కానీ, 67వ నిమిషంలో డాన్ ఎండోయె చేసిన గోల్‌తో స్విట్జర్లాండ్ స్కోరును 1-1తో సమం చేసింది. నిర్ణీత సమయంలో ఏ జట్టుకూ ఆధిక్యం లేకపోవడంతో మ్యాచ్ అదనపు టైంకు వెళ్లింది. అక్కడ కూడా అర్జెంటీనాకు స్విట్జర్లాండ్ పోటీనిచ్చింది. అయితే, 112వ నిమిషంలో జులియన్ అల్వరెజ్, 121వ నిమిషంలో లౌటరో మార్జినెట్ గోల్స్ చేసి అర్జెంటీనాకు విజయాన్ని కట్టబెట్టారు. ఇప్పటి వరకు అర్జెంటీనా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడలేదు.

భళా బెల్లింగ్‌హామ్

మరో టైటిల్ ఫేవరెట్ ఇంగ్లాండ్ కూడా సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో ఆ జట్టు నార్వేను ఓడించింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చివరికి 2-1 తేడాతో విజయం సాధించింది. బెల్లింగ్‌హామ్ రెండు గోల్స్ చేసి ఇంగ్లాండ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌లో మొదట నార్వేదే తొలి గోల్. 36వ నిమిషంలో ఆ జట్టు ప్లేయర్ ఆడ్రీస్ గోల్ చేశాడు. ఆ తర్వాత 47వ నిమిషంలో బెల్లింగ్‌హామ్ గోల్ చేసి స్కోరును 1-1 లెవల్ చేశాడు. 93వ నిమిషంలో కూడా అతనే మరో గోల్ చేసి ఇంగ్లాండ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్, నార్వే గోల్ కోసం పోటీపడ్డాయి. ఇంగ్లాండ్ 14 సార్లు గోల్ కోసం ప్రయత్నిస్తే.. నార్వే 13 సార్లు గోల్ పోస్టుపై దాడి చేసింది.

Next Story