- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతపై కేంద్రం పాశవిక దాడులను ఖండించాలి
ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

దిశ, మహబూబ్‌నగర్ ప్రతినిధి : ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ గురువారం మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలను తీవ్రంగా ఖండించారు. పేపర్ లీకేజీ ఘటనల్లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపించారు. దీంతో విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా సీటు వస్తుందనే నమ్మకం కోల్పోతున్నారని, తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.
ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఖండించిన ఆయన, ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్పందించడం లేదని విమర్శించారు. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పునరుద్ధరించాలని, నీట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అభిలాష్ రావు, నాయకులు వాల్యా నాయక్, రాజేశ్వర్ గౌడ్, గంజి వెంకన్న, కె.సి. నర్సింహులు, శివరాజ్, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






