- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేటలో భారీ ధాన్యం అక్రమాలు వెలుగులోకి..
సూర్యాపేట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్త బృందం ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీ స్థాయిలో ధాన్యం కొరత బయటపడింది.

దిశ,సూర్యాపేట,; ప్రభుత్వ ధాన్యం అక్రమాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నల్గొండ జిల్లా విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సూర్యాపేట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్త బృందం ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీ స్థాయిలో ధాన్యం కొరత బయటపడింది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.69 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం గల్లంతైనట్లు అధికారులు గుర్తించడం జిల్లాలో సంచలనంగా మారింది.జూలై 20న సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్, రైస్ మిల్లులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో వజ్ర వికాస్ రైస్ మార్ట్ నుంచి భారత ఆహార సంస్థ (FCI)కు సరఫరా చేయాల్సిన బియ్యాన్ని ఖమ్మం జిల్లా ముదిగొండలోని సత్యసాయి రైస్ కార్పొరేషన్ పేరుతో లారీల్లో లోడ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
దీంతో వెంటనే లోడింగ్ ప్రక్రియను నిలిపివేసి, సంబంధిత లారీలు, బియ్యం నిల్వలు, రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రెండు రైస్ మిల్లుల్లో భౌతిక ధృవీకరణ (ఫిజికల్ వెరిఫికేషన్) చేపట్టి స్టాక్‌ను రికార్డులతో సరిపోల్చారు.తనిఖీల్లో రికార్డుల ప్రకారం ఉండాల్సిన ధాన్యంతో పోలిస్తే భారీ కొరత బయటపడింది. వజ్ర రైస్ కార్పొరేషన్‌లో 11,073.054 మెట్రిక్ టన్నులు,వజ్ర వికాస్ రైస్ మార్ట్‌లో 18,114.834 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా 29,187.888 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు నిర్ధారించారు.ఈ ధాన్యం కొరత విలువను ప్రాథమికంగా సుమారు రూ.69 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. జిల్లా పౌర సరఫరాల అధికారి సమక్షంలో పంచనామా నిర్వహించి, మిల్లుల్లో లభ్యమైన ధాన్యం, బియ్యం నిల్వలను సీజ్ చేశారు.
ఈ ఘటనపై సంబంధిత రైస్ మిల్లులపై రికవరీ చర్యలు ప్రారంభించడంతో పాటు, చట్టపరమైన చర్యల్లో భాగంగా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే స్వాధీనం చేసుకున్న ధాన్యాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇతర అనుమతి పొందిన రైస్ మిల్లులకు తరలించాలని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ ధాన్యం, బియ్యం నిల్వలు, కస్టమ్ మిల్లింగ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) కు సంబంధించిన అక్రమాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని, ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, ప్రభుత్వ ధాన్యం నిర్వహణలో పారదర్శకత, బాధ్యతపై మరోసారి దృష్టి సారించే పరిస్థితి ఏర్పడింది. అధికారులు దర్యాప్తును మరింత విస్తరించి, ఈ అక్రమాల్లో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు.






