నీట్‌పై నిరసనల అణచివేత ప్రజాస్వామ్యానికి మచ్చ.. మోడీ పాలన పతనానికి నాంది : అద్దంకి దయాకర్

by Ramesh Naini |

దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని, ఈ విధానాలే కేంద్ర ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతాయని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు.

నీట్‌పై నిరసనల అణచివేత ప్రజాస్వామ్యానికి మచ్చ.. మోడీ పాలన పతనానికి నాంది : అద్దంకి దయాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని, ఈ విధానాలే కేంద్ర ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతాయని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేయడం అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు. ఆడ విద్యార్థినులను కూడా చూడకుండా పోలీసుల ముసుగులో ఆర్ఎస్ఎస్ అనుబంధ శక్తులు దాడులకు పాల్పడ్డాయని ఆరోపించారు. సీఎల్పీలోని మీడియా సెంటర్‌లో ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్‌తో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో దాడుల సంస్కృతిని బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం అవివేకమని, పోరాటాలు, త్యాగాలు రాహుల్ గాంధీ కుటుంబానికి కొత్త కాదన్నారు. నీట్ పేపర్ లీకేజీ వంటి తీవ్రమైన అంశంపై ప్రధాని మోడీ నేరుగా స్పందించకుండా ట్వీట్లతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. బాధిత విద్యార్థులు, వారి కుటుంబాలకు ప్రధాని క్షమాపణ చెప్పే వరకు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ, 2019లో టెండర్ నిబంధనలకు విరుద్ధంగా గ్లోబరీనా సంస్థకు అప్పటి మంత్రి కేటీఆర్ టెండర్ కట్టబెట్టారని ఆరోపించారు. అప్పటికే ఆ సంస్థపై కేసులు నమోదై ఉన్నాయని, ఆ సమయంలోనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి ఉంటే దేశంలో పేపర్ లీక్‌ల పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాయని ఆరోపించిన బల్మూర్ వెంకట్, బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడులను కేటీఆర్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ప్రజలు ఆయన మాటలను నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.

Next Story