బీసీ కులగణనపై కేంద్రం మోసం చేస్తోంది.. జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-26 10:27:00  IST  )

దేశంలో వెనుకబడిన తరగతుల కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతోందని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు.

బీసీ కులగణనపై కేంద్రం మోసం చేస్తోంది.. జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో వెనుకబడిన తరగతుల కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతోందని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుల్లో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం విడుదల చేసిన కులగణన డాక్యుమెంట్‌లో ‘బీసీ’ అనే స్పెషల్ కాలమ్ లేకపోవడం బీసీ సామాజిక వర్గాలను అవమానించడమేనని ఆమె మండిపడ్డారు. గతంలో 2011లో కాంగ్రెస్ పార్టీ బీసీలను ఏ విధంగానైతే వంచించిందో ఇప్పుడు 2026లో బీజేపీ ప్రభుత్వం అదే పద్ధతిలో అన్యాయం చేస్తోందని విమర్శించారు.

29న రౌండ్ టేబుల్ సమావేశం..

తెలంగాణలోని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం బీసీ కులగణనపై తప్పుడు గణాంకాలను వెల్లడిస్తోందని, దీంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కవిత ఆరోపించారు. కేవలం ప్రధాన కులాలే కాకుండా, బీసీల్లోని ప్రతి ఉప కులాన్ని కూడా విడివిడిగా లెక్కించాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తోందని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో బీసీల హక్కుల కోసం తాము ‘యుద్ధ భేరి’ మోగిస్తామని స్పష్టం చేశారు. బీసీ మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. ఈ మేరకు జనవరి 29న హైదరాబాద్‌ (Hyderabad)లో కీలకమైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లుగా స్పష్ట చేశారు. ఈ భేటీలోలో బీసీలు, ఉప కులాలు మరియు సంచార జాతులతో చర్చించి, ఏ కులం ఎంత శాతం ఉందో శాస్త్రీయంగా ఒక నివేదికను తయారు చేస్తామని అన్నారు. ఆ డాక్యుమెంట్‌ను తెలంగాణ జాగృతి తరపున కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి, మా హక్కులను సాధించుకుంటామని కవిత తెలిపారు.

READ MORE .....

సర్కారు నిర్లక్ష్యంతో మరో విద్యార్థిని చనిపోయింది.. జాగృతి చీఫ్ కవిత ఫైర్

Next Story