విమాన ప్రయాణికులకు ఊరట.. 100% పెరగాల్సిన ఇంధన ధరలను 25% కే పరిమితం చేసిన కేంద్రం!

by Malleboina Mahesh |

విమాన ఇంధన ధరల మోత నుంచి దేశీయ ప్రయాణికులకు భారీ ఊరట! 115% పెరగాల్సిన ATF ధరను 25% కే పరిమితం చేసిన కేంద్ర ప్రభుత్వం.

విమాన ప్రయాణికులకు ఊరట.. 100% పెరగాల్సిన ఇంధన ధరలను 25% కే పరిమితం చేసిన కేంద్రం!
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేతతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా, ఏప్రిల్ 1 నుండి దేశీయ మార్కెట్‌లో విమాన ఇంధన (ATF) ధరలు ఏకంగా 115 శాతం పెరిగి, కిలో లీటరుకు రూ. 2.07 లక్షల రికార్డు స్థాయికి చేరుకోవాల్సి ఉంది. ఈ మేరకు అన్ని కంపెనీలు ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాయి. కానీ చివరి నిమిషంలో.. దేశీయ విమాన ప్రయాణ ఖర్చులు సామాన్యులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ధరల పెరుగుదల నుండి దేశీయ విమానయాన రంగాన్ని రక్షించేందుకు, కేవలం 25 శాతం (లీటరుకు రూ. 15 మాత్రమే) మేర పక్షపాత, దశలవారీ పెంపును మాత్రమే అమలు చేయాలని చమురు మార్కెటింగ్ కంపెనీలకు (OMCs) సూచించింది.

ఈ నిర్ణయం వల్ల ఢిల్లీలో ATF ధర రూ. 1,04,927గా, ముంబైలో రూ. 98,247గా నిర్ణయించబడింది. ఒకవేళ ప్రభుత్వం జోక్యం చేసుకోకపోయి ఉంటే, ఈ ధరలు రూ. 2.10 లక్షలకు పైగా ఉండేవని అధికారులు తెలిపారు. అయితే ఈ రాయితీ కేవలం దేశీయ మార్గాల్లో ప్రయాణించే విమానాలకు మాత్రమే వర్తిస్తుందని, విదేశీ మార్గాల్లో నడిచే విమానాలు మాత్రం అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా పూర్తి స్థాయి పెంపును చెల్లించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇది ప్రయాణికులపై భారాన్ని తగ్గించడమే కాకుండా విమానయాన రంగం స్థిరంగా ఉండటానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.

Next Story