- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి సంస్థను నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ : ఎమ్మెల్యే సత్యనారాయణ రావు
సింగరేణిని సర్వనాశనం చేసిన వారే ఇప్పుడు దాని పరిరక్షకులుగా మాట్లాడటం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : సింగరేణిని సర్వనాశనం చేసిన వారే ఇప్పుడు దాని పరిరక్షకులుగా మాట్లాడటం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా మార్చే సంస్కృతి ఈ రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉందని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని ఆదాయ వనరుగా కాకుండా దోపిడీ కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. అందినకాడికి దోచుకుని, ఇప్పుడు సింగరేణి కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు మాట్లాడటం ప్రజలను మోసం చేసే ప్రయత్నమేనన్నారు. భూపాలపల్లికి రావాల్సిన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును రాజకీయ ప్రయోజనాల కోసం యాదాద్రికి తరలించారని ఆరోపించారు.
ప్రాజెక్టు వ్యయాలను అమాంతం పెంచి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. నాసిరకం సామగ్రి, అవినీతి నిర్మాణాలతో ప్లాంటును పనికిరాని స్థితికి చేర్చారని అన్నారు. అలాగే సింగరేణి పరిధిలోని ప్రజల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులను సిద్ధిపేట, హైదరాబాద్ వంటి ఇతర ప్రాంతాలకు తరలించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదా అని ప్రశ్నించారు. గనుల వల్ల ఇబ్బందులు పడుతున్న భూపాలపల్లి ప్రజలకు న్యాయం చేయకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం నిధులను మళ్లించారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు భూపాలపల్లి పర్యటనలో సింగరేణి పై మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు అన్నారు. అయినప్పటికీ తమ తప్పులను అంగీకరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం వారి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్,టౌన్ అధ్యక్షుడు దేవన్,కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు






