- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చనిపోతావని చెప్పిన జ్యోతిష్యుడు.. భయంతో యువతి ఆత్మహత్య
ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి, కొత్త జీవితాన్ని ప్రారంభించిన తొమ్మిది రోజులకే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని జ్యోతిష్యుడు చెప్పిన మాటలకు భయపడి బలవన్మరణానికి పాల్పడింది.

దిశ, వెబ్ డెస్క్: పొట్టకూటి కోసం జ్యోతిష్యం చెప్పుకునే వ్యక్తి మాటలకు భయపడి నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన ఎక్కడో పల్లేటూరిలో కాదు..సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా గా పేరుగాంచిన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని యశ్వంతపుర సమీపంలోని బాగలకుంటె ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల విద్యాజ్యోతి, ఒక ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. గత కొంతకాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విద్యాజ్యోతి కొడగు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని ప్రేమించింది, వారిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో తొమ్మిది రోజుల క్రితమే వారి వివాహం జరిగింది. అయితే, వివాహం తర్వాత తన వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న కుతూహలం తో ఆమె ఒక జ్యోతిష్యుడిని సంప్రదించింది.
విద్యాజ్యోతి భవిష్యత్తును పరిశీలించిన ఆ జ్యోతిష్యుడు, ఆమెకు 'అల్పాయుష్షు' ఉందని, వివాహం తర్వాత కేవలం రెండేళ్లలోనే విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పి తీవ్రంగా భయపెట్టాడు. ఈ గండాన్ని తప్పించుకోవాలంటే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయాలని, చివరి రోజైన శుక్రవారం నాడు ధరించిన తాళిని (మంగళ సూత్రాన్ని) తీసి అమ్మవారికి సమర్పించాలని సూచించాడు. జ్యోతిష్యుడి మాటలను గుడ్డిగా నమ్మిన విద్యాజ్యోతి, ఎనిమిది రోజుల పాటు నిష్ఠగా పూజలు నిర్వహించింది. శుక్రవారం పూజ ముగింపులో భాగంగా తాళిని తీయడానికి గదిలోకి వెళ్లిన ఆమె, మరణం పట్ల నెలకొన్న భయాందోళనలతో తీవ్ర మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆమె ఎంతసేపటికీ గది నుంచి బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కిటికీ గుండా చూడగా, విద్యాజ్యోతి నిర్జీవంగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విద్యాజ్యోతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 'అనుమానాస్పద మృతి' (Unnatural Death) కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ జ్యోతిష్యుడి ప్రమేయం, ఇతర కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. చనిపోతాననే భయం, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం స్థానికంగా అందరిని ఆశ్చర్యానికి, విషాదానికి గురిచేసింది.






