- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ బంగారం మాదే..!
వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండల కేంద్రంలో ఓ భూమిలో బంగారు ఆభరణాల విడిభాగాలు లభ్యమైనట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

దిశ, నర్సంపేట : వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండల కేంద్రంలో ఓ భూమిలో బంగారు ఆభరణాల విడిభాగాలు లభ్యమైనట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. పదేళ్ల క్రితం ఆ భూమిని విక్రయించిన కుటుంబం తాజాగా పోలీసులను ఆశ్రయించడం ఈ వ్యవహారాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చింది. చెన్నరావుపేట మండల కేంద్రానికి చెందిన కేతిడి జైపాల్ రెడ్డి తన కుటుంబ ఆర్థిక అవసరాల నిమిత్తం పదేళ్ల క్రితం గ్రామానికి చెందిన రాధారపు ప్రతాప్ రెడ్డి కుమార్తెకు ఆరు ఎకరాల భూమిని విక్రయించాడు. అనంతరం ఆ భూమిని ఈర్య తండాకు చెందిన భూక్య బాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వారం రోజుల క్రితం పత్తి పంటలో కలుపు తీస్తున్న సమయంలో హారం, పుస్తెలు, హారంలోని గుండ్లు వంటి బంగారు ఆభరణాల విడిభాగాలు లభ్యమైనట్లు గ్రామంలో ప్రచారం జరిగింది. కూలీల ద్వారా ఈ విషయం బయటకు రావడంతో భూ యజమాని, కౌలుదారు కలిసి సుమారు 50 తులాల బంగారాన్ని పంచుకున్నట్లు జైపాల్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను భూమిని విక్రయించినప్పటికీ, అందులో ఉన్న చెట్లు, పుట్టలు, నిధి నిక్షేపాలపై తమ కుటుంబానికే హక్కు ఉంటుందని జైపాల్ రెడ్డి వాదిస్తున్నాడు. గ్రామంలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో విషయాన్ని ఆరా తీయగా, బంగారం లభించిందని సంబంధిత వ్యక్తులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
గతంలోనూ బంగారం దొరికిందన్న ప్రచారం..
చెన్నరావుపేట మండల కేంద్రానికి సమీపంలోని కోపాకుల చెరువు పరిసర ప్రాంతాల్లో గతంలో ఆలయాలు ఉండేవన్న ప్రచారం స్థానికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే 1991లో ఇదే ప్రాంతంలో ఓ కుటుంబానికి బంగారం లభించిందని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే అప్పట్లో భూమి యజమాని వద్ద పనిచేసిన ఓ వ్యక్తికీ బంగారం దొరికిందన్న ప్రచారం ఇప్పటికీ కొనసాగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదే ప్రాంతంలో గతంలో దేవతా విగ్రహాలు కూడా బయటపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి, బంగారం లభించిందన్న ప్రచారంపై విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని గ్రామస్తులు కోరుతున్నారు.






