ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్ట‌ర్‌గా హైద‌రాబాద్‌.. సీఎంతో భేటీలో సునీల్ మిట్టల్

by Prasad Jukanti |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్ట‌ర్‌గా హైద‌రాబాద్‌.. సీఎంతో భేటీలో సునీల్ మిట్టల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, AI కార్యకలాపాలపైన దృష్టి పెట్టాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్‍కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇవాళ ఎంసీఆర్ హెచ్‌ఆర్‍డీ బోధీ పెవిలియ‌న్‌లో సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, సంస్కరణలను వివరిస్తూ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేకంగా విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేస్తున్న తీరును వివరించారు. పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అధునాతన సాంకేతిక విధానాలతో ఏటీసీలుగా మార్చిన విషయాలను తెలిపారు. ఇదే కోవలో పాలిటెక్నిక్ కాలేజీల అధునికీకరణ గురించి చెప్పారు.

వీలైనంత తొందరగా చందన్ వెల్లి డేటా సెంటర్:

చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత తొందరగా ప్రారంభించాలని, తెలంగాణలో మరింత పెద్ద సమగ్ర డేటా సెంటర్, AI మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాల‌ని సీఎం కోరారు. రాష్ట్రంలో భవిష్యత్ పెట్టుబడి అవకాశాలు, సమస్యలను పరిష్కరించడం కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేసి స‌మ‌న్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

విద్యార్థులకు స్కాలప్ షిప్‍లు:

భార‌తీ ఫౌండేష‌న్ ద్వారా ప్రభుత్వ పాఠ‌శాల‌లు, ఏటీసీల్లో చ‌దువుకునే విద్యార్థుల‌కు స్కాల‌ర్ షిప్‌లు అందజేస్తామ‌ని ఈ సందర్భంగా సునీల్ మిట్టల్ సీఎంకు తెలిపారు. అలాగే, ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్టర్‌గా హైద‌రాబాద్‌ను పరిగణిస్తున్నామని చెప్పారు. డేటా సెంట‌ర్ల కెపాసిటీని మ‌రింత పెంచ‌డానికి సిద్ధంగా ఉన్నామని, తెలంగాణలో ఫైబ‌ర్ క‌నెక్టివిటీ మ‌రింత పెంచ‌డంపైన ఈ సందర్భంగా సునీల్ మిట్టల్ ఆస‌క్తిని ప్రదర్శించారు.

Next Story