- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం గ్రీన్ సిగ్నల్..
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రాన్ని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రాన్ని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆలయ పరిసర ప్రాంతాల సమగ్రాభివృద్ధి, భూ వినియోగం, గెస్ట్ హౌస్‌ల నిర్మాణం, భూ సేకరణ, పర్యాటక అభివృద్ధి, ఆలయ నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
యాదగిరిగుట్ట లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావాలంటే భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక వసతుల అభివృద్ధి, ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంశాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ లేకుండా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు భూమి...
యాదగిరిగుట్ట లో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ముందుకు వచ్చిన హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు మార్కెట్ విలువ ప్రకారం భూమిని కేటాయించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం భూమి కేటాయింపు చేపట్టాలని అధికారులకు సూచించారు.
కుల సంఘాలకు పారదర్శక విధానం...
యాదగిరిగుట్ట లో వివిధ కుల సంఘాలకు స్థలాల కేటాయింపుపై గతంలో వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని ఇకపై స్పష్టమైన నిబంధనలు, పారదర్శక విధి విధానాలతో కూడిన ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎవరికైనా ఒకే విధమైన ప్రమాణాలు వర్తించేలా విధానాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు.
భూముల యాజమాన్యం ఆలయానిదే...
అభివృద్ధి కోసం కేటాయించే భూములపై యాజమాన్య హక్కులు ఆలయ అధికారుల వద్దనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. భూములు ఇతర అవసరాలకు మళ్లించబడకుండా, ఆలయ ప్రయోజనాల కోసమే వినియోగించేలా నిబంధనలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తిరుమల తరహాలో గెస్ట్ హౌస్‌లు...
యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వసతి సదుపాయాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. గెస్ట్ హౌస్‌ల నిర్మాణానికి సంబంధించి తిరుమలలో అమలవుతున్న విధానాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, అదే నమూనాను యాదగిరిగుట్ట లో అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే గెస్ట్ హౌస్‌ల నిర్మాణానికి ముందుకు వచ్చిన వారి జాబితాను రూపొందించి, అర్హతల ఆధారంగా విడతల వారీగా అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించారు. గెస్ట్ హౌస్‌ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు, వాస్తు, పార్కింగ్, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
భూసేకరణకు నిధులు...
యాదగిరిగుట్ట అభివృద్ధికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భూసేకరణ ఆలస్యం కాకుండా తక్షణమే అవసరమైన నిధులు విడుదల చేసి పనులను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. భవిష్యత్తు అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా భూములను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఆలయ నిర్మాణం పై నివేదిక...
యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణ పనులపై ఇంజనీర్ల కమిటీ సమర్పించిన నివేదికను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఆ నివేదిక ఆధారంగా వారం రోజుల్లో సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా, అవసరమైన సాంకేతిక సూచనలను అమలు చేయాలని సూచించారు.
టూరిజం సర్క్యూట్ అభివృద్ధి...
పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో యాదగిరిగుట్ట టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. యాదగిరిగుట్ట ను రాష్ట్రంలోని ఇతర పర్యాటక ప్రాంతాలతో అనుసంధానం చేసి దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు సాంస్కృతిక, ప్రకృతి పర్యాటకానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సమీక్షా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంఓ సెక్రటరీ మానిక్ రాజ్, సీఎంఓ ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






