- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్‌ఎస్‌పీ భద్రత తొలగింపు.. భగ్గుమన్న గులాబీ శ్రేణులు
కాగజ్‌నగర్ పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఉన్న భద్రతను ప్రభుత్వం అకస్మాత్తుగా తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి.

దిశ, కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఉన్న భద్రతను ప్రభుత్వం అకస్మాత్తుగా తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. పట్టణంలోని బస్టాండ్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ ఏకపక్ష ధోరణికి, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కాగజ్‌నగర్ హోరెత్తిపోయింది. ఆందోళన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బస్టాండ్ వద్దకు చేరుకుని నిరసనకారులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకులకు మధ్య తీవ్ర నెట్టులాట, ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ముఖ్యనాయకులు కొంగ సత్యనారాయణ, కాశిపాక రాజుతో పాటు చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు గంటపాటు రోడ్డుపైనే కార్యకర్తలు బైఠాయించడంతో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్‌ఎస్‌పీకి ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ప్రభుత్వం భద్రతను తొలగించిందని, ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని నాయకులు ఆరోపించారు. ఆయనకు ఏమాత్రం ప్రాణహాని జరిగినా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. తక్షణమే సెక్యూరిటీని పునరుద్ధరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని కొంగ సత్యనారాయణ, కాశిపాక రాజు హెచ్చరించారు.






