తమిళనాట 'దళపతి' శకం.. రేపే సీఎంగా విజయ్ ప్రమాణం?

by Malleboina Mahesh |

తమిళనాడు కొత్త సీఎంగా విజయ్ మే 7న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 10 మంది ఏఐడీఎంకే ఎమ్మెల్యేల మద్దతుపై ఉత్కంఠ నెలకొనగా, చిన్న పార్టీలతో కలిసి విజయ్ సర్కార్ కొలువుదీరనుంది.

తమిళనాట దళపతి శకం.. రేపే సీఎంగా విజయ్ ప్రమాణం?
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా సమాలోచనలు చేస్తుంది. ఎన్నికల ఫలితాల్లో 108 సీట్లు గెలిచిన టీవీకే.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ అధినేత విజయ్ మే 7న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చెన్నై పనైయూర్‌లో జరిగిన టీవీకే నూతన ఎమ్మెల్యేల సమావేశంలో విజయ్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయన సీఎం అభ్యర్థిగా అధికారికంగా ఖరారయ్యారు.

సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, కేబినెట్ ఏర్పాటు పై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అదే సమయంలో మెజార్టీ మార్కు 118 అందుకోవడానికి టీవీకేకు మరో 10 సీట్లు అవసరం. ఇప్పటికే టీవీకేకు మద్దతిచ్చేందుకు పలు పార్టీలు, నేతలు సిద్ధంగా ఉన్నారని, గురువారమే విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తారని టీవీకే వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

టచ్‌లో ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు?

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం కోసం చూస్తున్న టీవీకేతో సుమారు 10మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్టు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. టీవీకేకు మద్దతిచ్చే అంశంపై అన్నా డీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో విజయ్‌తో టచ్‌లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి టీవీకేలో చేరతారా? లేక పళనిస్వామి నేరుగా టీవీకేకు మద్దతు ప్రకటిస్తారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. కాగా.. టీవీకే విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజయ్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దీనికి స్పందించిన విజయ్.. వారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం మద్దతు కోరుతున్నట్టు ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

ప్రభుత్వానికి మెజారిటీ ఎలా ?

టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎలా మద్దతు కూడగట్టుకుంటుందనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. విజయ్ మెజారిటీని నిరూపించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, పట్టాలి మక్కల్ కట్చి, లెఫ్ట్ పార్టీలు, సీపీఎం, విడుతలై చిరుతైగల్ కట్చి వంటి చిన్న పార్టీల మద్దతు కోరే అవకాశం ఉంది. వారి నుంచి మద్దతు లభిస్తే టీవీకే సులభంగా మెజార్టీ మార్కును దాటుతుంది. అయితే ఈ కూటమి ఏర్పాటుపై తమిళనాడు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ స్పందిస్తూ.. దీనిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కానీ ఇప్పటికే టీవీకేకు మద్దతిచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు?

ఒకవేళ విజయ్ ఎవరి మద్దతు అవసరం లేదనుకుంటే అతిపెద్ద ఏకైక పార్టీగా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. కచ్చితంగా మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ ఆయనను ఆహ్వానిస్తే.. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఇలా మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏ బిల్లును ఆమోదించుకోవాలన్నా ప్రతిసారి ప్రతిపక్షాల మద్దతుపై ఆధారపడాల్సి ఉంటుంది. అలా కాకుండా డీఎంకే, ఏఐడీఎంకే కూటముల నుంచి కూడా ఎమ్మెల్యేలను విజయ్ ఆకర్షించే అవకాశం ఉంది. ఆ కూటముల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలు టీవీకే వైపు మళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

Next Story